ఓ సినిమా టీజర్ చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు అంటే.. అది భయపెట్టే సీన్ అయినా అయి ఉండాలి. ఆ సీన్‌కి తప్ప ఇంకే సీన్‌కి ఆ ఎక్స్‌ప్రెషన్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ ఓ ఎరోటిక్ సీన్ చూసిన ఉలిక్కిపడ్డాడు అంటే ఆ టీజర్ కచ్చితంగా ‘టాక్సిక్’ సినిమాదే అయి ఉండాలి. యశ్‌కి ఇప్పటివరకు ఉన్న ఫేమ్, ఇమేజ్.. ఆ సినిమా డైరక్టర్ గురించి తెలిసినవాళ్లు ఎవరూ ఆ సీన్ ఊహించి ఉండరు. హీరో పాత్ర గురించి వివరించడానికి అలా చేశారో లేక ఇంకే కారణమైనా ఉందో తెలియదు కానీ.. ఆ సీన్ ఇప్పుడు టాక్ ఆప్ ది ఇండియన్ ఇండస్ట్రీ. అలాంటి సీన్ పెట్టి ట్రెండ్ అయిన డైరక్టర్ గీతా మోహన్‌దాస్ గురించి మీకు తెలుసా?
గీతూ మోహన్ దాస్ పూర్తి పేరు గాయత్రి. ఆమె తండ్రి పేరు మోహన్ దాస్. మలయాళీ కుటుంబానికి చెందిన ఆమె కొచ్చిలో జన్మించారు. నటిగా తొలుత సినిమాల్లో అడుగు పెట్టారు. బాలనటిగా సినిమాలు చేశారు. వాటికి స్టేట్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌తో డైరక్టర్ అయ్యారు. ఆ వెంటనే స్ట్రెయిట్ ఫిల్మ్ తీశారు. వాటికి ఏకంగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ‘ఒన్ను ముట్టల్ పూజ్యం వరె’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సినిమా చేసే టైమ్‌కి ఆమె నాలుగేళ్లే.

ఆ తర్వాత కథానాయికగా మోహన్ లాల్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో మొదలైంది. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో గీతూ ఒకరు. ఆ తర్వాత వచ్చిన ‘అకలే’ సినిమాలో నటనకుగాను కేరళ స్టేట్ అవార్డు అందుకుంది. కొన్ని సినిమాలు చేశాక ఏమైందో ఏమో ఇక చాలు అని ఆపేసింది. అక్కడికి కొన్నేళ్లకు ‘లయర్స్ డైస్’తో డైరక్టర్ జర్నీ స్టార్ట్ చేశారు. ‘లయర్స్ డైస్’ సినిమాకుగాను ఉత్తమ నటిగా గీతాంజలి థాపా, ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ రవి జాతీయ పురస్కారాలు దక్కాయి. ఆ తర్వాత ‘ముథోన్’ అనే సినిమా చేశారు. దానికి అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవిని నవంబర్ 14, 2009న వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె. అన్నట్లు ‘టాక్సిక్’ సినిమాకు కూడా భర్తనే సినిమాటోగ్రఫీ.
