కొందరి శాడిజం ప్రదర్శించుకోవడానికి సోషల్ మీడియా ఒక వేదికైపోయింది. ఎదుటివాళ్ళ అభిప్రాయాలలో, వ్యక్తిగత విషయాలలో వేలు పెడుతూ ఉంటారు కొందరు. ఎంత మంది ఎన్ని సార్లు చెప్పినా వారి పద్ధతి మారదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2000లో వచ్చిన బద్రి మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఆ చిత్ర హీరోయిన్ రేణూదేశాయ్.
ఆ పోస్ట్ లకు ఓ నెటిజెన్ ”ఈ రేణూదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు. ఆ మధ్య చాలా చేసింది. మళ్లీ ఈ పోస్టులు ఎందుకు? ఎంగేజ్‌మెంట్ అయింది కదా ఆ విషయం ఏమైంది?” అంటూ కామెంట్ చేశాడు. దానికి ప్రతి స్పందంగా రేణు ‘బద్రి నా మొదటి సినిమా ఆ తాలూకు జ్ఞాపకాలు పంచుకంటే తప్పేంటి అన్నారు. ‘నాపై మీకు ఇంత ద్వేషం ఎందుకు అన్నా..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఇక్కడ మనం గమనించాల్సింది మగాళ్లతో సమానంగా ఆడవాళ్లకు హక్కులు ఉండ కూడదా అని. రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటే తప్పేంటి. ఆమె వ్యక్తిగత విషయాలను ఈ వీరాభిమానులు ఎందుకు గెలుకుతున్నారనేది బాధాకరం. ఇంత ఆధునిక సమాజంలో ఉండి, ఇలాంటి సంకుచిత భావాలు కలిగిన ఈ ఫ్యాన్స్ వలన ఎవరికీ ఉపయోగం ఉండదని కొందరి వాదన.
పవన్ కళ్యాణ్ తో రేణు విడిపోయిన తర్వాత ఆమె చాలాకాలానికి తన పెళ్లి వార్త తెరపైకి తెచ్చారు. దానిని ఒక వర్గం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. ఈ పరిణామాలపై ఆమె తీవ్ర వేదనకు గురయ్యారు. ఏదిఏమైనా చాల కాలంగా రేణు దేశాయ్ కొందరి నుండి అనేక వేధింపులకు గురి అవుతున్నారు.