నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు..!

ఓ పక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరో పక్క మంచి కథ దొరికితే… నిర్మాతగా మారి రూపొందించడానికి కూడా మన టాలీవుడ్ హీరోలు ముందుకొస్తున్నారు. ఇలా నిర్మాతల కష్టాన్ని గుర్తించడమే కాకుండా.. చిన్న హీరోలను, మీడియం రేంజ్ ఉన్న హీరోలను కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీని నమ్ముకున్న ఎంతో మందికి.. చేతి నిండా పని కల్పిస్తూ… వారి కుటుంబాలని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ హీరోలెవరెవరు ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ పక్క స్టార్ హీరోగా చలామణి అవుతున్న టైంలోనే ‘పవన్ కళ్యాణ్ క్రియెటివ్ వర్క్స్’ బ్యానర్ ను స్థాపించి.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. తరువాత తన డై హార్డ్ ఫ్యాన్ కం హీరో అయిన నితిన్ ను హీరోగా పెట్టి ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాన్ని నిర్మించాడు అది కూడా ప్లాప్ అయ్యింది. అయినా వెనకడుగు వేయకుండా భవిష్యత్తులో కూడా సినిమాలు నిర్మిస్తానని పవన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

1 - Pawan Kalyan as producer

2) మహేష్ బాబు : ‘శ్రీమంతుడు’ చిత్రంతో ‘జి.ఎం.బి(జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్) ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా మారిన మహేష్.. మొదటి చిత్రంతోనే పెద్ద హిట్ అందుకున్నాడు. అటు తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని కూడా నిర్మించాడు. అయితే అది మహేష్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక మొన్నటికి మొన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని కూడా నిర్మించి పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అడివి శేష్ ను హీరోగా పెట్టి ‘మేజర్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు.

2 - Mahesh Babu As Producer

3) రాంచరణ్ : తన తండ్రి రీ ఎంట్రీ చిత్రాన్ని నిర్మించే బాధ్యతను స్వీకరించి… ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ ను స్థాపించాడు రాంచరణ్. మొదటి ప్రయత్నంగా ‘ఖైదీ నెంబర్ 150’ ని నిర్మించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే అటు తరువాత చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా వెనకడుగు వేయకుండా ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.

3 - Ram Charan As Producer

4) నాని : నేచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. మరో పక్క ‘వాల్ పోస్టర్ సినిమా’ పేరుతో బ్యానర్ ను స్థాపించి.. నిర్మాతగా కూడా సక్సెస్ లను అందుకుంటున్నాడు. ‘అ!’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించి హిట్ అందుకున్న నాని… ఇటీవల విశ్వక్ సేన్ తో ‘హిట్’ పేరుతో మరో చిత్రాన్ని కూడా అందించి సూపర్ హిట్ అందుకున్నాడు.

4 - Hero Nani as producer

5) విజయ్ దేవరకొండ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. గతేడాది ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఆ చిత్రం యావరేజ్ గానే ఆడింది. అయితే నిర్మాతగా విజయ్ కు లాభాల్ని అందించింది.

5 - Vijay Deverakonda as producer

6) మంచు మనోజ్ : కెరీర్ ప్రారంభం నుండీ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ .. మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్.. తన ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ‘ఎం.ఎం.ఆర్ట్స్’ అనే బ్యానర్ ను స్థాపించి స్వయంగా మనోజే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కేవలం తన సినిమాలనే కాకుండా మిగిలిన హీరోలతో కూడా సినిమాలు చేస్తానని చెబుతున్నాడు.

6 - Manchu Manoj as producer

7) నాగార్జున : ‘కింగ్’ నాగార్జున హీరోగానే కాకుండా.. మంచి నిర్మాతగా కూడా మంచి పేరుని సంపాదించుకున్నాడు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై తన సినిమాలు.. తన కొడుకుల సినిమాలే కాకుండా.. మిగిలిన హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ‘ఆహా’ ‘ఉయ్యాల జంపాల’ ‘నిర్మలా కాన్వెంట్’ వంటి చిత్రాలను నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కథ నచ్చితే మన కింగ్ ఏమాత్రం వెనకడుగు వెయ్యడు.

7 - Nagarjuna as producer

8) నందమూరి కళ్యాణ్ రామ్ : ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ను స్థాపించి ‘అతనొక్కడే’ ‘పటాస్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన కళ్యాణ్ రామ్.. తన తమ్ముడు ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు.

8 - Kalyan Ram as producer

9) దగ్గుబాటి రానా : మన బల్లాల దేవుడు రానా మంచి అభిరుచిగల నటుడు అనడంలో అతిశయోక్తిలేదు. కేవలం పాటల కోసం, ఫైట్ల కోసం సినిమాలు చెయ్యడు. కాస్త లేటైనా మంచి పాత్రలు.. కాన్సెప్ట్ లు ఉన్న సినిమాలు చేస్తాడు. ‘బొమ్మలాట’ ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రాలను నిర్మించినందుకు ప్రశంసలు కూడా అందుకున్నాడు రానా.

9 - Rana Daggubati as producer

10) సుధీర్ బాబు : సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సుధీర్ బాబు. మొదటి నుండీ మంచి కాన్సెప్ట్ లు ఉన్న సినిమాలు చేస్తూ.. మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మరియు రివ్యూలు వచ్చినప్పటికీ.. కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇతర హీరోలతో కూడా ఈ బ్యానర్లో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నట్టు కూడా సుధీర్ బాబు గతంలో తెలిపాడు.

10 - Sudheer Babu as producer

నితిన్ : యూత్ స్టార్ నితిన్ ‘శ్రేష్ట్ మూవీస్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘చిన్నదాన నీకోసం’ ‘ఛల్ మోహన్ రంగ’ వంటి చిత్రాలను నిర్మించాడు. అంతేకాదు అఖిల్ మొదటి చిత్రమైన ‘అఖిల్’ కు కూడా నిర్మాత నితినే..! భవిష్యత్తులో కూడా ఇతర హీరోలతో సినిమాలు నిర్మించడానికి కూడా నితిన్ రెడీ అంటున్నాడు.

11 - Nithiin as producer

శర్వానంద్ : మినిమం గ్యారెంటీ హీరో అనే పేరున్న శర్వానంద్ సైతం.. ‘శర్వా ఆర్ట్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘కో అంటే కోటి’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. మంచి సినిమా అనే ప్రశంసలు దక్కించుకుంది. నిర్మాతగా శర్వానంద్ పై సైతం ప్రశంసలు కురిసాయి..!

12 - Sharwanand as producer

 

Share.