ఒక సినిమా ప్రమోషన్ విషయంలో చాలా కీలకపాత్ర పోషించే ట్రైలర్ ను ఒకప్పుడు కనీసం ఒక నెల ముందు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొనేవారు. నెల ముందు నుంచీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ థియేటర్లలో ఆ ట్రైలర్ ప్లే అవ్వడంతో ప్రేక్షకులకి కూడా “ఓహో ఫలానా సినిమా వస్తుందా, ఇలా ఉండబోతోందా” అని ఒక అంచనా ఏర్పడేది. అయితే.. గత రెండేళ్ల నుంచి తెలుగు సినిమా మేకర్స్ మాత్రం ఈ ట్రైలర్ రిలీజ్ విషయంలో ఒక వింత పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నారు. విడుదలకి సరిగ్గా వారం లేదా నాలుగు రోజుల ముందు మాత్రమే ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు.
హాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ లాంటి ఇతర భాషా దర్శకనిర్మాతలందరూ పాత పద్ధతినే ఫాలో అవుతూ ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకి రప్పిస్తుండగా.. మనోళ్లు మాత్రం అదేదో గొప్ప పని అన్నట్లుగా ఫీలవుతూ తమ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ప్రేక్షకులకు చూపించడానికి భయపడే స్థాయికి చేరుకొన్నారు. మరి ఈ పద్ధతి ఇంకెన్నాళ్ళు ఇలా కొనసాగుతుందో చూడాలి.