ఒకప్పుడు టాలీవుడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్లోజ్‌గా ఉండేవి. తరచుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని సినిమా పరిశ్రమ పెద్దలు కలుస్తూ ఉండేవారు. ఆ కలయికల ఉపయోగాలు ఏంటో అ తర్వాత ఏవో కేటాయింపులు అయ్యేటప్పుడు తెలిసేవి. ఇది చాలా ఏళ్లు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయాక కూడా ఈ అనుబంధం కనిపించింది. అయితే తెలంగాణలోనే సినిమా పరిశ్రమ ఉండటంతో ఇక్కడి ప్రభుత్వంతోనే అనుబంధం ఉండేది. ఆంధ్రప్రదేశ్‌తో చాలా తక్కువ. అయితే ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పాత రోజులు వస్తాయి… టాలీవుడ్ – ఏపీ ప్రభుత్వం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది, ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నారంతా.
కట్ చేస్తే ఏడాది గడిచిపోయినా ఇప్పటివరకు టాలీవుడ్ సినిమా పెద్దలు, అసోసియేషన్లు ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవలేదు. మధ్యలో ఓపారి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్‌ను కలిసినట్లు ఉన్నారు. కొన్నాళ్లు ఈ వ్యవహారంలో కామ్‌గా ఉన్న డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. సినిమా పరిశ్రమ కోసం ఎంతో చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని సినిమా పరిశ్రమ పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినిమా పెద్దలు సీఎం చంద్రబాబును కలుస్తారు అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు కలవలేదు.
గత ఏడాదిగా మీటింగ్ పుకార్లు చాలానే వచ్చినా గత నెల 15న అపాయింట్‌మెంట్ అడిగారని.. తాను సినిమా పరిశ్రమ వాళ్లను రమ్మన్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఆయన చెప్పిన తేదీ వెళ్లిపోయి చాలా రోజులైంది. మధ్యలో ఓ వారం పవన్ కల్యాణ్ బిజీ.. అందుకే వచ్చే వారం అని మాట చెప్పారు. ఆ మాట చెప్పి కూడా రెండు వారాలు అయింది. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్ జనాలకు సీఎంను కలవాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు.
సినిమా పరిశ్రమలోని పెద్దలకు, సీఎం చంద్రబాబుకు చాలా ఏళ్లుగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను కలవడానికి వారికి పెద్దగా ఉండదు. మరి ఎందుకని కలవడం లేదు. మధ్యలో ఉన్న వాళ్లు ఎవరైనా అడ్డుపడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే ‘సీఎంను కలవాలి కదా.. రిటర్న్ గిఫ్ట్’ లాంటి మాటలు పవన్ కల్యాణ్ అనడం వల్ల సినిమా పరిశ్రమ కలవడం లేదా అనేది తెలియాలి. అదే జరిగితే పవన్ మాటలకు టాలీవుడ్ విలువ ఇవ్వడం లేదు అని చెప్పొచ్చు.