Tollywood: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై టాలీవుడ్‌ స్టార్ల మౌనం ఎందుకో?

  • September 9, 2021 / 11:28 AM IST

ప్రైవేటు బస్సు టికెట్లను ప్రభుత్వం అమ్మితే ఎలా ఉంటుంది?…షాపింగ్‌ మాల్‌లో మీ సరకుల బిల్లింగ్‌ ప్రభుత్వం చేస్తే ఎలా ఉంటుంది?…పాలు పాకెట్‌ కొందామని షాప్‌కి వెళ్తే… అక్కడ డబ్బులు ప్రభుత్వం తీసుకుంటే?…మీరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌, మొబైల్‌ రీఛార్జ్‌ చేసేటప్పుడు… ఆ డబ్బులు మాకివ్వండి అని ప్రభుత్వం మధ్యలోకి వస్తే… చాలా విచిత్రంగా, వింతగా, అయోమయంగా ఉంది కదూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇలాగే ఉంది. పైన చెప్పిన నాలుగు జరిగితే మీకు ఎంత కోపం వస్తుంది. ‘షాపులు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొంటే ప్రభుత్వ జోక్యమా?’ అనే కోపం వస్తుంది కదా. మరి ‘సినిమా’కు ఇంత జరుగుతున్నా టాలీవుడ్‌ పెద్దలు నోరు మెదపడం లేదేంటి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

రైల్వే టికెట్‌ల బుకింగ్‌కి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ తరహాలో… ఏపీలో టికెట్ల బుకింగ్‌కి ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ జీవో జారీ చేసింది. బయటి నుండి చూసేవారికి ‘ప్రభుత్వం ఇలా పని చేయడం వల్ల ప్రజలకు లాభమే’ అనే మాట వినిపిస్తుంది, కనిపిస్తుంది. అయితే ప్రైవేటు వ్యాపారాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఎందుకు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణాలేంటి అనేది కాసేపు పక్కనపెడితే… ఇంత జరుగుతున్నా టాలీవుడ్‌ పెద్దలు మాట్లాడరేంటి?

టాలీవుడ్‌ సినిమాల గురించి, సినిమా వాళ్ల కష్టాల గురించి మాట్లాడే చాలామంది స్టార్లు ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఏకంగా థియేటర్ల వ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు శరాఘాతంలా పరిణమించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అయితే ఈ ప్రభుత్వ పోర్టల్‌ మల్టీప్లెక్స్‌ పోర్టల్స్‌ వర్తించదు అనే వార్తలు వస్తున్నాయి. ఎంత మల్టీప్లెక్స్‌ల కాలం అయినా… థియేటర్ల వ్యవస్థ లేకపోతే… సినిమాలు ఎక్కడ ఆడతాయి. మన హీరోలు ఎక్కడ సినిమాలు చేస్తారు.

అంతలా తమ హీరోగిరీకి ఇబ్బంది అని తెలిసినా మన హీరోలు స్పందించడం లేదు. నిన్నే కదా జీవో ఇచ్చారు… స్పందిస్తారులే అనుకుంటున్నారా. తమ్ముడి సినిమానో, బామ్మర్ది సినిమానో, మిత్రుడి సినిమానో చూసి రాత్రికి రాత్రి ట్వీట్లు పెట్టే మన హీరోలకు ‘ఏపీ ప్రభుత్వ జీవో’ విషయం తెలియకుండా ఉంటుందా. సినిమాలకు డబ్బులు పెట్టే నిర్మాతలు, కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అని చెప్పుకునే దర్శకులు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. నిజానికి జగన్‌ ప్రభుత్వం ‘వకీల్‌సాబ్‌’ సమయంలో టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సమయంలోనే ఇండస్ట్రీ స్పందించాల్సింది.

ఎప్పుడో పదేళ్ల క్రితం ధరలతో కొత్త ధరల పట్టిక చేసినప్పుడు మనవాళ్లు స్పందిచలేదు. ఆ ధరల వల్ల థియేటర్లు నడపడం కష్టమని చాలామంది థియేటర్లు తెరవలేదు. కరోనా కష్టాలతో అప్పుల ఊబిలో చిక్కుకున్నవారిపై ఇంకాస్త బరువు వేసినట్లు అప్పుడు టికెట్‌ రేట్లు ఫైనల్‌ చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పనే చేశారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక ప్రస్తుత పరిస్థితి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సినిమా టికెట్ల డబ్బులు తమ దగ్గర పెట్టుకొని నెలకోసారి తమకు రావాల్సిన మొత్తం కట్‌ చేసి ఇస్తామని చెబుతోంది. దీంతోనే సమస్య కూడా ఉంది.

ఏపీలో నెల జీతాలు నెలకోసారి ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది… టికెట్‌ బుకింగ్‌ ద్వారా ఈ డబ్బులు అన్నీ తీసుకొని నెలకోసారి థియేటర్లకు డబ్బులు సమయానికి ఇస్తారా అనేది అనుమానమే. దీంతో ఉద్యోగులు, ప్రజల జీవితాల్లాగే థియేటర్లు కూడా కుంటాల్సి ఉంటుంది. అయినా ఎక్కడో చిన్న ఆశ… సినిమాల్లో హీరోలు అనిపించుకొని, ట్విటర్‌లో కింగ్‌లు అనిపించుకునే, ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌ లేపే మన హీరోలు నిజ జీవితంలోనూ హీరోలుగా నిలుస్తారని. మరి తమ సినిమా పరిశ్రమ ఏపీలో పడుతున్న ఇబ్బందులు చూసి… ఎప్పటికి మేలుకొంటారో. హీరోలూ మీరు దేవుళ్లే… మీ సినిమా పరిశ్రమను మీరే కాపాడుకోండి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus