డైనమిక్ లేడీ మంచు లక్ష్మీ టైటిల్ పాత్ర పోషించడంతోపాటు నిర్మించిన చిత్రం “వైఫ్ ఆఫ్ రామ్”. రాజమౌళి వద్ద “ఈగ, బాహుబలి” చిత్రాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన విజయ్ యేలకంటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో రెగ్యులర్ తెలుగు సినిమాల తరహాలో పాటలు, ఫైట్లు లేకపోవడం విశేషం. మరి ఈ వైవిధ్యమైన చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!
కథ : మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చి భర్త రామ్ (సామ్రాట్)తో సంతోషంగా జీవించాలనుకొంటుంది దీక్ష (లక్ష్మీ మంచు). అయితే అక్టోబర్ 23న జరిగిన ఓ సంఘటన కారణంగా దీక్ష భర్త రామ్ మరణించడంతోపాటు.. కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కోల్పోతుంది దీక్ష.
ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ రిజిష్టర్ అయినప్పటికీ.. రామ్ ను చంపింది ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాదు. ఎస్సై సత్యం (శ్రీకాంత్ అయ్యంగర్) ఈ కేస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదని అర్ధం చేసుకొన్న దీక్ష తానే స్వయంగా డీల్ చేయడం మొదలెడుతుంది. ఆమెకు కానిస్టేబుల్ రమణా చారి (ప్రియదర్శి) సహాయపడుతుంటాడు. అలా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన దీక్షకు రామ్ మరణం వెనుక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందని తెలుస్తుంది. ఏమిటా కాన్స్పిరసీ? ఒంటరి ఆడడైన దీక్ష ఆ కేసును ఎలా చేధించింది? ఇంతకీ రామ్ ను చంపింది ఎవరు? అనేవి “వైఫ్ ఆఫ్ రామ్” సినిమాను థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు : దీక్ష పాత్రలో లక్ష్మీ మంచు అభినయం పరంగా ఆకట్టుకొంది. పాత్రలో డిఫరెంట్ గా కనిపించడం కోసం ఆమె చేయించుకొన్న మేకోవర్ కాస్త విచిత్రంగా ఉంటుంది. ఒంటరి మహిళగా ఆమె పాత్రను చాలా మంది ఓన్ చేసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
లక్ష్మీ మంచు తర్వాత ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకొన్న వ్యక్తి శ్రీకాంత్ అయ్యంగర్. పోలీస్ పాత్రలో ఆ క్యారెక్టర్ కు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో చాలా రియలిస్టిక్ గా కనిపించాడు. ప్రియదర్శి, ఆదర్శ్ బాలకృష్ణ, సామ్రాట్ తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. వారి స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను సినిమాలో లీనం చేయడానికి ఉపయోగపడింది.
సాంకేతికవర్గం పనితీరు : రఘు దీక్షిత్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమా మొత్తం ఒకటే థీమ్ మ్యూజిక్ లా కాకుండా సన్నివేశానికి తగ్గట్లుగా డిఫరెంట్ స్కోర్స్ అందించడం, సస్పెన్స్ ను పెంచేలా రఘు డిజైన్ చేసిన సౌండ్ సినిమాకి ప్లస్ అయ్యింది. సామాల భాస్కర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ లైటింగ్, టిపికల్ యాంగిల్స్ వాడకుండా.. సినిమాకి, కథకి అవసరమైన రీతిలో సహజంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా సగానికి పైగా నైట్ మోడ్ లో ఉంటుంది. ఆ రియాలిటీని భాస్కర్ చక్కగా హ్యాండిల్ చేసి ఆడియన్స్ కు చక్కని అనుభూతిని కలిగించాడు. ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, డి.ఐ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. 105 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం పెద్దగా బోర్ కొట్టదు.
దర్శకుడు విజయ్ యేలకంటి హిందీ “కహానీ”ని తన కథకు స్ఫూర్తిగా తీసుకొని, అదే చిత్రానికి రీమేక్ గా రూపొందిన “అనామిక”ని స్క్రీన్ ప్లే పరంగా ఏడాప్ట్ చేసుకొన్నాడనే విషయం ఫస్టాఫ్ లోనే అర్ధమవుతుంది. సినిమా డీలింగ్ ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్ లోనూ “కహానీ, అనామిక” చిత్రాలను తలపిస్తాయి. విజయ్ రాసుకొన్న కథలో దమ్ము ఉంది, అలాగే స్క్రీన్ ప్లేటో ఎంగేజ్ చేయగల సత్తా ఉంది. వచ్చిన సమస్యల్లా.. ప్రేక్షకుడ్ని హోల్డ్ చేసే స్థాయి ఎమోషన్ అనేది క్లైమాక్స్ లో తప్ప ఎక్కడా కనిపించదు. 6 నెలల గర్భాన్ని పోగొట్టుకొన్న స్త్రీమూర్తిలో కనబడాల్సిన బాధ కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే చూపించాడు. అలాగే.. భర్తను మిస్ అవుతున్నట్లుగా కంటే.. భర్తను చంపినవాడ్ని పట్టుకోవాలనే ధ్యేయమే ఎక్కువగా పాత్ర వ్యవహారశైలిలో కనిపిస్తుంది.
అయితే.. ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం మాత్రం బాగుంది, కానీ ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ చేసేలా ఉండి ఉంటే ప్రేక్షకుడు చివరిదాకా ముక్కున వేలేసుకొని చూసేవాడు. కానీ.. ఆ ట్విస్ట్ ను రివీల్ చేసినంత సందర్భానుసారంగా ఆ ట్విస్ట్ ను ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయాడు. అయితే.. సినిమాలో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్స్ అని, పాటలు అని టైమ్ వేస్ట్ చేయకుండా కథను నడిపించడం అనేది విజయ్ చేసిన మంచి పనుల్లో ఒకటి.
విశ్లేషణ : రెగ్యులర్ తెలుగు సినిమాల తరహాలో కాకుండా విజయ్ కాస్త వైవిధ్యంగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ “వైఫ్ ఆఫ్ రామ్”. లాజికల్ గా ఆకట్టుకొనే ఈ చిత్రం థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారిని అమితంగా కాకపోయిన ఓ మోస్తరుగా ఆకట్టుకొంటుంది. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా కాస్త వైవిధ్యమైన సినిమా చూశామన్న అనుభూతి కోసం “వైఫ్ ఆఫ్ రామ్” చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.