ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. వందల కోట్ల చిత్రాల హీరో. దేశంలోనే అత్యధిక మార్కెట్ వాల్యూ కలిగిన హీరో. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ స్టార్ డమ్ వివరించడానికి చాలా సమయమే పడుతుంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఎంచుకునే సబ్జక్స్ కూడా విభిన్నంగా ఉంటున్నాయి. ఐతే ప్రభాస్ యూనివర్సల్ సబ్జెక్టులు తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకోగలవా అనే అనుమానం మొదలైంది. దీనికి సాహో మూవీ ఫలితమే ఉదాహరణ. నిజానికి సాహో లాంటి సినిమా తీయడానికి దర్శకుడు సుజీత్ చాలా కష్టపడ్డాడు.
ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఆయన హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇది సౌత్ ఇండియా ప్రేక్షకులకు, ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. హిందీలో మాత్రం సాహో భారీ విజయం దక్కించుకుంది. దానికి కారణం బాలీవుడ్ ప్రేక్షకులు ఆ తరహా చిత్రాలను యాక్సప్ట్ చేయగలరు. ఇప్పటికే ధూమ్ సిరీస్ క్రిష్ లాంటి చిత్రాలు అక్కడ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అదే తరహా స్క్రీన్ ప్లేతో గ్రాండ్ గా తెరకెక్కిన సాహో బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది. ప్రభాస్ ఇమేజ్ దృష్ట్యా ఒక తరహా కథలు, ఫార్మాట్ అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఆయన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు.
మరి ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో రాధే శ్యామ్ కూడా ప్రయోగాత్మక చిత్రమే అని తెలుస్తుంది. ఈ మూవీ ప్రభాస్ రెగ్యులర్ చిత్రాల మాదిరి అదిరిపోయే యాక్షన్, సాంగ్స్, డైలాగ్స్ కలిగి ఉండదట. ఎమోషన్స్ తో కూడిన సెన్సిబుల్ లవ్ స్టోరీ అని తెలుస్తుండగా, తెలుగులో వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనితో సాహో మాదిరి రాధే శ్యామ్ బాలీవుడ్ లో హిట్టై, టాలీవుడ్ లో నిరాశపరుస్తుందా అనే అనుమానం కలుగుతుంది.