ఇక సినిమాలు కష్టమే…. టీవీలు వచ్చిన కొత్తల్లో ఇలానే అనేవారట. థియేటర్లకు వచ్చి జనాలు సినిమాలు చూడటం క్రమక్రమంగా బంద్ అయిపోతుంది అనుకునేవారట. అయితే అనుకున్నంతగా టీవీ… థియేటర్లను ఇబ్బందిపెట్టలేదు. ఎవరి పని వారు చేసుకుందాం అనే కాన్సెప్ట్‌లో రెండూ ప్రేక్షకులను అలరించాయి. పైరసీ వచ్చాక… మళ్లీ థియేటర్లు ఇబ్బందిపడ్డాయి. అయితే ఇది కొంతమేరే. అయితే ఇప్పుడు ఓటీటీలు వచ్చి మళ్లీ థియేటర్లను ఇబ్బంది పెడుతున్నాయా… పరిస్థితుల్ని ఒకసారి విశ్లేషించుకుందాం.
దేశంలోకి ఓటీటీలు వచ్చి చాలా ఏళ్లైంది. అయితే బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం కరోనా పరిస్థితులు వచ్చాక మాత్రమే. అవును కరోనా – లాక్ డౌన్ పరిస్థితులే దేశంలో ఓటీటీ వ్యాప్తిని పెంచాయి. ప్రజలకు వినోదం అంటే టీవీలు మాత్రమే అనే పరిస్థితి నుండి ఓటీటీ కూడా అనే పరిస్థితి వచ్చింది. ఇతర చిత్ర పరిశ్రమల్లో సినిమాలు, కంటెంట్‌కు మనవాళ్లు బాగా అలవాటుపడ్డారు. కొత్త ఓటీటీలు రావడం, డబ్బింగ్ చేసి ఇతర వుడ్స్ సినిమా తేవడంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది.
కరోనా తొలి వేవ్ అయ్యాక… ప్రజలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలకు మంచి వసూళ్లే వచ్చాయి. అయితే రెండో వేవ్ అయ్యాక థియేటర్ల తెరుచుకున్నా ప్రజలు పెద్దగా ఆసక్తిచూపించడం లేదు. గత కొన్ని వారాలుగా కొన్ని సినిమాలు వస్తున్నా… ఒకట్రెండు రోజులకే ఖాళీ అయిపోతున్నాయి. దీంతో థియేటర్లను ఓటీటీ దెబ్బకొట్టింది అనే రోజు వచ్చిందా అని విశ్లేషకులు అంచనాలు మొదలుపెట్టారు. అయితే సరైన సినిమా పడితేనే విషయం పూర్తిగా తెలుస్తుంది. సో… థియేటర్ vs ఓటీటీపై ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.