Abburi Ravi: పెళ్లిచూపులంటే హోటల్స్‌.. రీల్స్‌ అయిపోయింది.. రైటర్‌ కామెంట్స్‌ వైరల్‌

‘ఆ ఒక్కటి అడక్కు’ (Aa Okkati Adakku)  సినిమాలో సందేశం ఏంటి? ‘కష్టపడి పని చేస్తే ఎవరైనా విజయవంతం అవుతారు.. లేనిపోని మూఢనమ్మకాలు వద్దు’ అని చెబుదాం అనుకుంటున్నారా. మేం అడిగింది కొత్త ‘ఆ ఒక్కటి అడక్కు’ గురించి. దీనికి కూడా మీ దగ్గర ఆన్సర్‌ ఉండొచ్చు. ఎందుకంటే సినిమాలో మెయిట్‌ పాయింట్‌ అయిన ‘హీరో పెళ్లి’ టీజర్‌, ట్రైలర్‌లో చూపించేశారు కాబట్టి. అయితే సినిమా టీమ్‌ మాత్రం మేము ఎలాంటి సందేశాలు, మెసేజ్‌లు ఇవ్వడం లేదు అని చెబుతోంది.

సినిమాకు రచయితగా వ్యవహరించిన అబ్బూరి రవి (Abburi Ravi) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 3న థియేటర్లలో అసభ్యత లేని వినోదం అందిస్తాం అని చెప్పారు. ట్రైలర్‌లో చూపించినట్లు పెళ్లి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రమిదని చెప్పిన ఆయన.. ఆ పాయింట్‌ను వినోదాత్మకంగా చూపిస్తూ, ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేసేలా చెప్పాం అని తెలిపారు. అంతే తప్ప ప్రత్యేకంగా సందేశం ఇవ్వడమన్నది ఏమీ లేదు అని అంటున్నారు. అయితే ఈ సినిమా చూశాక చాలామంది ఆలోచిస్తారు అని నమ్మకంగా చెబుతున్నారాయన.

పెళ్లి అనేది చాలా పవిత్రమైనదని, పెళ్లి చూపులు ఇంట్లో జరిగేవి. కానీ, ఇప్పుడు చాలా వరకు హోటల్స్‌లో జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో చూసి పెళ్లి చూపులు పెట్టుకుంటున్నారు. ఓకే చేసుకుంటున్నరు కూడా. పెళ్లి అంత తేలిగ్గా ఉండకూడదు. ఒక బంధం బలంగా నిలబడాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చాలా అంశాల్ని ఈ సినిమాలో చూపించాం అని అబ్బూరి రవి తెలిపారు.

తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పిన ఆయన.. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన డ్రీమ్‌ అయిన డైరక్షన్‌ను త్వరలో చేస్తాను అని కూడా చెప్పారు. రచయితగా యాక్షన్‌ థ్రిల్లర్స్‌ అంటే ఇష్టమని చెప్పారు. ఇక ప్రస్తుతం ‘గూఢచారి 2’ (Goodachari), ‘డెకాయిట్‌’ సినిమాలకు రచయితగా పని చేస్తున్నాను అని చెప్పారు. ఈ రెండు సినిమాలకూ అడివి శేష్‌ హీరో అనే విషయం తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus