Writer Movie Review: రైటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

వైవిధ్యమైన కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ .. వారిలో నూతన ఉత్సాహం నింపుతూ వస్తుంది ‘ఆహా’. ప్రతీ శుక్రవారం ‘ఆహా’ వేదికగా ఓ కొత్త చిత్రాన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వారం కూడా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రైటర్’ చిత్రాన్ని డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించారు ‘ఆహా’ వారు.గత ఏడాది తమిళంలో రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేర అలరించిందో తెలుసుకుందాం రండి :

కథ : రంగరాజు (సముద్రఖని) అనకాపల్లికి చెందిన పోలీస్ స్టేషన్‌లో రైటర్ గా పనిచేస్తూ ఉంటాడు. పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు ఒక యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో అతను కోర్టు మెట్లెక్కుతాడు. కొంతమంది పై అధికారులకి ఇది నచ్చదు. దాంతో ఇతన్ని విశాఖపట్నానికి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయిస్తారు.ఈ క్రమంలో దేవ కుమార్ (హరీష్ కృష్ణన్) అనే పి.హెచ్.డి స్టూడెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని విశాఖలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో ఉన్న లాడ్జిలో ఉంచుతారు.

ఇతనిపై నక్సలైట్ అనే ముద్ర వేసి జైలుకు పంపాలి అనేది పోలీసులు కుట్ర అని రంగస్వామికి తెలుస్తుంది. దాంతో ఆ స్టూడెంట్ ను ఎలాగైనా తప్పించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో రంగరాజుకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అతని వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయి. చివరికి అతని నిజాయితీ గెలిచిందా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : రంగ రాజు పాత్రలో సముద్రఖని జీవించారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రకి జీవం పోశారు.’భీమ్లా నాయక్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘సర్కారు వారి పాట’ ‘అల వైకుంఠపురములో’ ‘క్రాక్’ వంటి చిత్రాల్లో మనం చూసిన సముద్రఖని వేరు. ఈ చిత్రంలో సముద్రఖని వేరు.ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన హైలెట్ అని చెప్పాలి. హరీష్ కృష్ణన్ అలాగే ఇతర నటీనటులు సినిమాకు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనిపిస్తారు.

కానీ సముద్రఖని వన్ మెన్ షో చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రధాన పాత్ర సముద్ర ఖని అవ్వడం వల్ల ఈ చిత్రం చూడాలనే ఆసక్తి మొదటి నుండీ ప్రేక్షకులకి కలిగింది. వారి అంచనాలకు సముద్రఖని నటన ఎక్కడా తగ్గలేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ఫ్రాంక్లిన్ జాకబ్ పోలీస్ వ్యవస్థలో ఉన్న తప్పు ఒప్పులను రెండింటిని చూపించారు. అవినీతి పరులతో పాటు నిజాయితీగా పనిచేసేవారు కూడా ఉన్నారు వాళ్ళకి ఎదురయ్యే కష్టాలు ఏంటి అన్న పాయింట్ ను ఇందులో చూపించారు. మొన్నామధ్య వచ్చిన ‘నాయట్టు’ ‘నాంది’ సినిమాల థీమ్ కూడా ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థలో పనిచేసే స్థాయి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే పాయింట్ ను డీల్ చేసిన విధానం బాగుంది.

దర్శకుడు తర్వాత గోవింద వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ప్రతీప్ కాళీ రాజా సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. పా రంజిత్, అభయ నంద సింగ్, పీయూష్ సింగ్, అదితి ఆనంద్ లు కథకు తగ్గట్టు లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాకి మంచి క్వాలిటీతో రూపొందించారు.

విశ్లేషణ :రైటర్ అంటే పోలీస్ స్టేషన్ కు వచ్చే వాళ్ళ కంప్లైంట్లు స్వీకరించి ఫైల్స్ రూపంలో భద్రపరిచేవాడు మాత్రమే కాదు.. ఓ సామాజిక అంశం పై ఫైట్ చేసేవాడు కూడా అని కొన్ని రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో ఈ ‘రైటర్’ చెప్పాడు. 2 గంటల 27 నిమిషాల నిడివి గల ఈ మూవీ అందరినీ మెప్పిస్తుంది. ‘ఆహా’ లో అందుబాటులో ఉంది.

రేటింగ్ : 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus