2025కి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. సాధారణంగా ఇయర్ ఎండింగ్ అంటే పెద్ద హీరోల హడావిడి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సీన్ వెరైటీగా ఉంది. డిసెంబర్ 19, 26 తేదీల్లో వచ్చే రెండు శుక్రవారాల్లో బాక్సాఫీస్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఏకంగా పది సినిమాలు క్యూ కట్టాయి. ఇందులో ఒక గ్లోబల్ జాయింట్ ఉంటే, మిగతావన్నీ కంటెంట్ ను నమ్ముకున్న చిన్న సినిమాలు.
Avatar 3
డిసెంబర్ 19న బాక్సాఫీస్ ను శాసించడానికి వస్తున్న అసలైన సినిమా ‘అవతార్ 3: ది ఫైర్ అండ్ యాష్’. మన తెలుగు ఆడియన్స్ కు సినిమా బాగుంటే భాషతో పనిలేదు, బ్రహ్మరథం పట్టేస్తారు. ప్రజెంట్ మన స్టార్ హీరోల సినిమాలు ఏవీ లేకపోవడం, రీసెంట్ గా వచ్చిన ఒక పాన్ ఇండియా సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు అందరి చూపు ఈ హాలీవుడ్ విజువల్ వండర్ మీదే పడింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి అవతార్ 3 రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.
అవతార్ ధాటిని తట్టుకుని అదే రోజున కొన్ని చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య లాంటి కామెడీ గ్యాంగ్ తో ‘సకుటుంబానాం’ వస్తుండగా, కొత్తవారితో ‘గుర్రం పాపిరెడ్డి’ అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అవతార్ సీరియస్ మోడ్ లో ఉంటే, ఇవి నవ్వులు పంచే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక చివరి శుక్రవారం అంటే డిసెంబర్ 26న పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఆ ఒక్క రోజే దాదాపు ఏడు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. శ్రీకాంత్ తనయుడు నటిస్తున్న ‘ఛాంపియన్’, యంగ్ హీరో ఆది సాయికుమార్ కంబ్యాక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ‘శంభాల’ రేసులో ఉన్నాయి. ఆదికి ఇది చాలా క్రూషియల్ సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అతనికి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నారు.
వీటితో పాటు బలగం తరహాలో ఎమోషనల్ టచ్ తో ‘దండోరా’, అలాగే ‘పతంగ్’, ‘ఈషా’ లాంటి చిన్న సినిమాలు, ‘వృషభ’, ‘మార్క్’ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా అదే రోజున దిగుతున్నాయి. ఏదేమైనా 2025 ముగింపు వేళ ఒక పక్క ప్రపంచం మెచ్చిన అవతార్, మరోపక్క మన లోకల్ కంటెంట్ సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఈ రేసులో గ్రాండ్ విక్టరీ కొట్టి ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికేది ఎవరో చూడాలి.