ఎవడు తక్కువ కాదు

  • May 24, 2019 / 12:35 PM IST

తమిళంలో 2014లో రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న “గోలీసోడా” అనే చిత్రాన్ని 2016లో కన్నడలో అదే పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు సాహిదేవ్ లగడపాటి కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రం కన్నడంలో పర్వాలేదనిపించుకొంది. మూడేళ్ళ తర్వాత ఆ చిత్రాన్ని తెలుగులో “ఎవడు తక్కువ కాదు” అనే పేరుతో అనువాద రూపంలో విడుదల చేశారు. మరి తమిళ చిత్రం టర్నడ్ తెలుగు డబ్బింగ్ వయా కన్నడ రీమేక్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: ఒక మార్కెట్ లో తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నించే ఓ నలుగురు కుర్రాళ్ళు (విక్రమ్ సాహిదేవ్ లగడపాటి, షిల్లే మంజునాథ్ & గ్యాంగ్) అక్కడ పూర్ణక్క అనే లేడీ వర్కర్ సహాయంతో మార్కెట్ లీడర్ అయిన మధుసూధన్ ద్వారా ఒక గోడౌన్ ను సంపాదించి హోటల్ గా తీర్చిదిద్ది సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. కానీ లింగా అనే రౌడీ మాత్రం కురాళ్ళు కష్టపడి తయారు చేసుకొన్న హోటల్ లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ వారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు. దాంతో ఎదురుతిగిన కుర్రాళ్లను లింగా & గ్యాంగ్ ఎలా ఇబ్బందులుపెట్టారు, ఆ ఇబ్బందులను ఈ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? అనేది “ఎవడు తక్కువ కాదు” కథాంశం.

నటీనటుల పనితీరు: “రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య” చిత్రాల్లో బాలనటుడిగా నటించి ఉన్న విక్రమ్ సాహిదేవ్ లగడపాటి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఒదిగిపోయాడు. చాలా ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. కానీ.. కన్నడ డబ్బింగ్ వెర్షన్ కావడంతో డైలాగ్స్ చాలా వరకూ లిప్ సింక్ కుదరక, కొన్ని సన్నివేశాల్లో ఒరిజినాలిటీ కనిపించకపోవడం ఒక్కటే మైనస్.

ప్రియాంక జైన్, మధుసూదన్ రావు, తార వంటి నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మధుసూదన్ రావు విలనిజం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: హరి గౌర సంగీతం, దాము నర్రావుల కెమెరా పనితనం ప్రొడక్షన్ వేల్యూస్ కి తగ్గట్లుగా ఉన్నాయి. తమిళ ఒరిజినల్ వెర్షన్ ఉన్నంత నేచురాలిటీ కన్నడ వెర్షన్ లో లోపించింది. ఇక కన్నడ నేటివిటీ మన తెలుగు నేటివిటీకి సింక్ అవ్వడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. సహజత్వం అనేది లేనప్పుడు కథలో దమ్ము ఉన్నా కథనానికి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు కాస్త సీరియస్ గా తీసుకోవాల్సింది. దాంతో సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బోలెడున్నప్పటికీ.. నేటివిటీ ఇష్యూస్ కారణంగా సినిమాకి అందరూ కనెక్ట్ అవ్వలేరు.

ఒరిజినల్ వెర్షన్ లో కనిపించిన పెయిన్ కానీ, స్ట్రగుల్ కానీ ఈ కన్నడ రీమేక్ టర్నడ్ తెలుగు డబ్బింగ్ లో కనిపించదు. ఆ కారణంగా తమిళ వెర్షన్ చూసిన ఆడియన్స్ కి “ఎవడు తక్కువ కాదు” పెద్దగా నచ్చదు. కానీ..తమిళ వెర్షన్ చూడనివాళ్ళకి మాత్రం ఫర్వాలేదనిపించే చిత్రమిది.

విశ్లేషణ: విక్రమ్ సాహిదేవ్ లగడపాటికి మంచి లాంచ్ ప్యాడ్ లాంటి సినిమా. అభినయ సామర్ధ్యం ఉంది కానీ.. లుక్స్ పరంగా కాస్త జాగ్రత్త తీసుకోగలిగితే హీరోగా ఎదగడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉన్నాయి. నేటివిటీ ఇష్యూస్ పక్కన పెడితే “ఎవడు తక్కువ కాదు” కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. సో, మధ్యలో కాస్త బోర్ కొట్టినా ఒకసారి ఈ చిత్రాన్ని సరదాగా చూడవచ్చు.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus