సినిమాలో నటుడిగా అవకాశాలు పొందాలంటే మంచి రూపం, ప్రతిభ, పరిచయాలు, డబ్బు .. వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉన్నాకూడా అదృష్టం లేకుంటే వెండి తెరపై కనిపించలేము. కానీ సినిమాలో హీరో అవ్వాలనే కోరిక, కసి, ఇంకా చెప్పాలంటే మొండి తనం, టన్నుల కొద్దీ ఆత్మ విశ్వాసంతో ఫిల్మ్ నగర్ వచ్చి అష్టకష్టాలు పడి గుంపులో గోవిందు పాత్రలు చేసి .. కమెడియన్ గా నిరూపించుకొని.. హీరోగాను విజయం అందుకున్న నటుడు ధన్ రాజ్. సర్వర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగిన అతని లైఫ్ సీక్రెట్స్..
1 . తాడేపల్లి గూడెంకు చెందిన సత్యరాజ్, కమలమ్మలకు ఏకైక సంతానం ధన్ రాజ్. తండ్రి లారీ డ్రైవర్. ధన్ రాజ్ కి పదేళ్ళప్పుడే సత్యరాజ్ ప్రమాదంలో చనిపోయారు. తల్లే కష్టపడి పెంచింది.
2. సినిమాల మీద పిచ్చితో పదవ తరగతి పరీక్షలు రాసి, 300 తీసుకొని అమ్మకు కూడా చెప్పకుండా ధన్ రాజ్ లారీ ఎక్కి ఫిల్మ్ నగర్ కి చేరుకున్నారు. చేతిలో ఉన్న డబ్బులు అయి పోవడంతో ఓ హోటల్లో సర్వర్ గా చేరి సినిమాలో అవకాశాల కోసం తిరిగే వారు.
3 . కమలమ్మ కొడుకుని వెతుక్కుంటూ ఫిల్మ్ నగర్ కి వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆయాగా పని చేస్తూ ధన్ రాజ్ ని ప్రోత్సహించింది.
4 . తేజ “జై” చిత్రంలో ధన్ రాజ్ జూనియర్ ఆర్టిస్టుగా తెర పైన కనిపించారు.
5. ధన్ రాజ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోకముందే అతని తల్లి క్యాన్సర్ తో చచ్చిపోయింది. ఆ సమయంలో అండగా నిలిచిన శిరీష అనే అమ్మాయిని పెద్దమ్మ గుడిలో ధన్ రాజ్ పెళ్లి చేసుకున్నారు.
6. జగడం ధన్ రాజ్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా. అందులో నాంపల్లి సత్యం క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. అప్పుడే డైరక్టర్ సుకుమార్, హీరో రామ్ తో పరిచయం ఏర్పడింది.
7. భార్య కడుపుతో ఉన్నప్పుడు వైద్య ఖర్చులకు హీరో రామ్ ని ధన్ రాజ్ సహాయం కోరారు. ఆయన సహాయం చేశారు. అందుకే కృతజ్ఞతగా పుట్టిన బాబుకి సుకుమార్, రామ్ పేర్లు వచ్చేలా “సుక్కు రామ్” అని పేరు పెట్టుకున్నారు.
8. ధన్ రాజ్ పిల్ల జమిందార్, పరుగు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూనే జబర్దస్త్ షో లో అడుగుపెట్టారు. ఈ షోతో ధనాధన్ ధన్ రాజ్ గా గుర్తింపు పొందారు.
9. ధనలక్ష్మి తలుపు తడితే, AK రావు PK రావు, పనిలేని పులిరాజు చిత్రాల్లో హీరోగా నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.
10. ధనలక్ష్మి తలుపు తడితే చిత్రం సినిమాలో ధన్ రాజ్ నటించడంతో పాటు ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని కొడుకు “సుక్కు రామ్” సమర్పించారు.