ఇదివరకూ భారీతనం అంటే గుణశేఖర్ గుర్తొచ్చేవాడు. కానీ.. గుణశేఖర్ సినిమాలు తీయడం కాస్త తగ్గించేసరికి ఆయన స్థానం ఎవరు భర్తీ చేస్తారబ్బా అని చూస్తున్న తరుణంలో “నేనున్నా” అంటూ అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి మరీ కూర్చున్నాడు బోయపాటి. ఈ మాస్ సినిమాల స్పెషలిస్ట్ హీరోలకు విశేషమైన మాస్ ఇమేజ్ తీసుకురావడంలో ఎంత స్పెషలిస్టో.. నిర్మాతల చేత డబ్బులు నీళ్లలా ఖర్చు చేయించడంలో కూడా అంతే స్పెషలిస్ట్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కోసం బోయపాటి పెట్టించే ఖర్చుకి ఎంత భారీ నిర్మాతైనా కాస్త జంకాల్సిందే.
బోయపాటి కెరీర్ మొత్తంలో “భద్ర, సింహా, సరైనోడు” తప్ప కమర్షియల్ గా సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఏమీ లేవు.
ఈ ట్రాక్ రికార్డ్ ప్రకారం బోయపాటితో తీసిన సినిమాకు నిర్మాతకు భారీగా సొమ్ము మిగిలిన దాఖలాలు లేవు. అయితే.. బోయపాటి మాత్రం ఎప్పుడూ బడ్జెట్ ను కేర్ చేయలేదు. తాజాగా రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న “వినయ విధేయ రామ” (వర్కింగ్ టైటిల్) సినిమా విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాడు బోయపాటి. ఆల్రెడీ బ్యాంకాక్ & అజేబెరిజాన్ లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ కి భారీ స్థాయిలో ఖర్చయ్యిందట. ఇప్పుడు హంసల దీవిలో తెరకెక్కించబోయే మరో యాక్షన్ సీన్ కి కూడా దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయించనున్నాడట. ఓవరాల్ గా ఇప్పటికే 100 కోట్ల బడ్జెట్ దాటేసిన చరణ్ సినిమా.. ఆస్థాయిలో కలెక్ట్ చేయగలదా అని ట్రేడ్ వర్గాలు కూడా కంగారుపడుతున్నారు.