జనవరి 26న రిపబ్లిక్ డే హాలిడే ఉండటంతో కొన్ని చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ లిస్ట్ లో హన్సిక నటించిన ‘105’ మినిట్స్ మూవీ ఒకటి. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేసి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న హన్సిక పెళ్లయ్యాక రూటు మార్చింది. కేవలం హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో చేసిన ‘మై నేమ్ ఈజ్ శృతి’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: కేవలం జాను(హన్సిక) చుట్టూ తిరిగే కథ ఇది. ఒకరోజు ఆమె ఆఫీస్ నుండి కారులో ఇంటికి వెళ్తున్న టైంలో ఆమె చనిపోయినట్లు ఊహించని దృశ్యాలు కనబడతాయి. దీంతో జాను షాక్ కు గురవుతుంది. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాక.. ఓ ఆత్మ జానుని చిత్రహింసలకు గురిచేస్తుంది. ఆమె కాలికి గొలుసుతో బంధించి రకరకాలుగా వేధిస్తూ ఉంటుంది. తప్పించుకోవాలని జాను ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మ విడిచిపెట్టదు. అంతేకాదు ఓ దశలో ఆ ఆత్మ పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టుగా కూడా జానుకి టీవిలో చూపిస్తుంది.
ఫైనల్ గా చేసేదేమీ లేక నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి జాను రెడీ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు జానుని చిత్రహింసలు పెడుతున్న ఆత్మ ఎవరిది? జానునే ఆ ఆత్మ ఎందుకు టార్గెట్ చేసింది? చివరికి జాను బ్రతికి బయట పడిందా లేదా? అనేది ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: హన్సిక తప్ప ఈ సినిమాలో ఎవ్వరూ ఉండరు. సింగిల్ క్యాస్ట్.. సింగిల్ టేక్ మూవీలా అనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఓ రకంగా హన్సిక బాగానే చేసింది అని చెప్పాలి. 2 గంటల పాటు ఒక ఆర్టిస్ట్ పైనే సినిమాని చిత్రీకరిస్తున్నప్పుడు..సగటు ఆర్టిస్ట్ ఆకట్టుకునే నటన కనపరిచకపోతే జనాలు కనీసం చివరి వరకు కూడా థియేటర్లలో కూర్చోడానికి ఇష్టపడరు.
ఆ రకంగా చూసుకుంటే హన్సిక పాస్ మార్కులు వేయించుకున్నట్టే..! కానీ మొదటి నుండి చివరి వరకు హన్సికలో భయం, నిస్సహాయత మాత్రమే చూపించడం ఇంకో రకంగా మైనస్ అని చెప్పాలి. అందువల్ల ఎమోషనల్ గా ఇంకొంత మంది ప్రేక్షకులు కనెక్ట్ అవ్వకపోవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు రాజు దుస్సా తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడా? అంటే అవునని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. ఎందుకంటే కథనంలో ల్యాగ్ ఉంది.అవే సన్నివేశాలు రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ‘సంభాషణలు కూడా హీరోయిన్ ను భయపెట్టే రెండు, మూడు వాయిస్ ఓవర్లతో కూడిన డైలాగులే ఉన్నాయి. ‘అరుంధతి’ లో బొమ్మాళి రవి శంకర్ వాయిస్ ఓవర్ అనుష్కని మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా భయపెట్టే విధంగా ఉంటుంది. ఆ రేంజ్లో ఉండుంటే ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. ఇక ఇలాంటి సినిమాలకి టెక్నికల్ టీం పనితీరు చాలా కీలకం.
ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా విషయంలో సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడపు, సంగీత దర్శకుడు సామ్ సి యెస్ ..లు కొంతవరకు న్యాయం చేశారని చెప్పొచ్చు. హీరోయిన్ కాలికి దెబ్బ తగిలినప్పుడు.. మెట్ల పై రక్తం పడకపోవడం, వర్షం కురిసే సన్నివేశంలో ఆ పక్కనే ఉన్న గోడపై చినుకులు పడకపోవడం వంటి విజువల్స్ ప్రేక్షకులు పసిగట్టేసేట్టే ఉన్నాయి. అలాంటి మైనస్సులు తీసేస్తే సినిమాటోగ్రాఫర్ వర్క్ కి మంచి మార్కులే వేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పేరు పెట్టనవసరం లేదు. ప్రొడక్షన్ డిజైన్ ను అద్భుతం అనలేం కానీ జస్ట్ ఓకే.
విశ్లేషణ: మొత్తానికి ఈ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ (One Not Five Minuttess) నిడివి కేవలం 2 గంటలు మాత్రమే..! కాబట్టి.. డిఫరెంట్ జోనర్ సినిమాలు అంటే తాప్సి ‘గేమ్ ఓవర్’, ‘అశ్విన్స్'(తమిళ్) వంటి ఫ్లేవర్ కలిగిన సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో.. అలాంటి వారు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus