తమిళనాట ఘన విజయం సొంతం చేసుకోవడం అనే విషయానికంటే ఓ 21 ఏళ్ల కుర్రాడు తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ అంటూ ఎక్కువగా ప్రచారం పొందిన చిత్రం “ధృవంగల్ పత్తినారు”. తెలుగులో “ఊసరవెల్లి” వంటి చిత్రాల్లో విలన్ గా నటించిన రెహమాన్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం గత పదేళ్ళలో రూపొందిన “బెస్ట్ థ్రిల్లర్”గా పేరు దక్కించుకోవడం విశేషం. మరి 21 ఏళ్ల కార్తీక్ నరేన్ వెండితెరపై సృష్టించిన అద్భుతమేంటో చూద్దాం..!!
కథ : ఓ హత్య, ఓ మిస్సింగ్ కేస్ నేపధ్యంలో పోలీసులు జరిపే ఇన్వెస్టిగేషన్, వారి ఇమేజినేషనే “16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్” చిత్రం. దీపక్ (రెహమాన్) ఓ కేస్ ఇన్విస్టిగేషన్ టైమ్ లో కుడి కాలు పోగొట్టుకొని తన శేష జీవితాన్ని ఫామ్ హౌస్ లో గడిపేస్తుంటాడు. తన కొడుకు ఐ.ఏ.ఎస్ అవ్వాలనుకొంటున్నాడని అతడికి ఆ ఉద్యోగంలోని కష్టానష్టాలను వివరించి చెప్పాల్సిందిగా తన అసోసియేట్ కోరగా.. కాదనలేక ఇంటికి రమ్మంటాడు. ఇంటికొచ్చిన యువకుడితో తాను ఎంతో చాకచక్యంతో డీల్ చేసి, చివరివరకూ కారకుడ్ని పట్టుకోలేకపోయిన్ ఆఖరి కేస్ గురించి చెప్పడం మొదలెడతాడు దీపక్. అలా చెబుతున్నప్పుడు కేస్ కి సంబంధించిన చాలా కీలకమైన విషయాలు తెలుస్తాయి.
ఏమిటా కీలక విషయాలు, ఆ యువకుడు దీపక్ లాస్ట్ కేస్ అంటే ఎందుకంత ఆసక్తి చూపుతాడు, ఇంతకీ సదరు కేస్ లో చివరవరకూ దొరక్కుండా ఉండిపోయిన వ్యక్తి ఎవరు, మిస్ అయిన అమ్మాయి చివరికి ఏమయ్యింది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ దర్శకుడు ఆసక్తికరమైన కథనంతో చెప్పిన సమాధానాల సమాహారమే “16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : దీపక్ పాత్రలో రెహమాన్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడనే చెప్పాలి. ఒక పోలీసోడికి ఉండే యాటిట్యూడ్ ను తన హావభావాలతో ఎలివేట్ చేసిన తీరు అభినందనీయం. రెహమాన్ కాకుండా సినిమాలో కనిపించేవారంతా దాదాపుగా కొత్తవారే. అయితే.. దర్శకుడికి ఉన్న విజన్ కారణంగా వాళ్ళ ప్రతిభ కంటే వారి పాత్రలే ఎక్కువగా ఎలివేట్ అయ్యాయి. అదే సినిమాకి ప్లస్ అయ్యింది కూడా.
సాంకేతికవర్గం పనితీరు : జేక్స్ బియోజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ఆయువుపట్టు. ఈ తరహా థ్రిల్లర్ కథాంశాలకు కావాల్సిన విధంగా సన్నివేశంలోని ఎమోషన్ ను, ఇంటెన్సిటీని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. సిజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇంత తక్కువ బడ్జెట్ లో ఈస్థాయి క్వాలిటీ తీసుకురావచ్చా అని మిగతా సినిమాటోగ్రాఫర్లందరూ ఆలోచించే స్థాయిలో ఉంది కెమెరా పనితనం. వర్షంలో స్లోమోషన్ షాట్స్, క్రేన్ అనేది వాడకుండా కేవలం గింబల్ తో పిక్చరైజ్ చేసిన టాప్ మరియు మిడ్ యాంగిల్ షాట్స్ చూస్తే “ఏం తీశాడ్రా బాబూ” అనుకోవాల్సిందే.
శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. ఎలివేషన్ షాట్స్ ను కట్ చేస్తూ వచ్చే డీటెయిల్డ్ షాట్స్, ఒక్క సీన్ మిస్సయినా సినిమా అర్ధం కాదు అనే స్థాయిలో స్క్రీన్ ప్లేను సమర్ధవంతంగా కట్ చేసిన తీరుకి ఏ అవార్డ్ ఇచ్చినా తక్కువే. ఇక దర్శకుడి గురించి మాట్లాడుకుందాం. సినిమా చూడ్డానికి ముందే దర్శకుడు వయసు తెలిస్తే “కుర్రాడు ఎంత బాగా తీశాడ్రా” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తే, సినిమా చూశాక వయసు తెలిస్తే మాత్రం “ఏంటి అంత చిన్న కుర్రాడా ఈ సినిమా తీసింది” ఆశ్చర్యపోతారు. “ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్” అనే టైటిల్ కి న్యాయం చేస్తూ.. సినిమాలోని ప్రతి సీన్, ప్రతి మాట కథలో భాగమయ్యేలా చేసిన విధానానికి, నేర్పుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా మొత్తం ఓ నాలుగు సార్లు చూసినా ఈ సీన్ ఇక్కడ అనవసరం, లేదా ల్యాగ్ ఉంది అనడానికి ఒక్కటంటే ఒక్క మైనస్ కూడా దొరక్కపోవడం విశ్లేషకుడిగా ఒకింత నిరాశ కలిగించినా.. సినిమా అభిమానిగా అంతులేని ఆనందానికి గురి చేసిన చిత్రమిది.
విశ్లేషణ : మన తెలుగు భాషలో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు,, కాదు కాదు తీయరు అని ఒకింత బాధపడుతూనే.. ఒక అద్భుతమైన థ్రిల్లర్ ను చూశామనే అనుభూతికి లోనూ చేసే చిత్రం “16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్”. 1.45 గంటల నిడివి ఉన్న సినిమాలో ఒక్క సెకను కూడా ల్యాగ్ అనేది లేకపోవడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.