ఓటీటీలకు అప్పుడప్పుడే అలవాటు పడుతున్న సమయంలో… కరోనా – లాక్‌డౌన్ రావడంతో మొత్తంగా అవే జీవితం అయిపోయాయి. థియేటర్లు మూతపడిపోవడం, వినోదానికి వేరే దారి లేకపోవడంతో అందరూ ఓటీటీలవైపే చూశారు. దీంతో 2020 మన దేశంలో ఓటీటీలకు గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. దీంతో ఈ ఏడాది ఓటీటీల్లో అదరగొట్టిన సినిమాలేంటి అనే ఆసక్తి రేగింది. అందులో భాగంగా తొలుత నెట్‌ఫ్లిక్స్ వివరాలు బయటికొచ్చాయి. ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల వివరాల్ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కింది.
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలకు పెద్దగా స్థానం ఉండదు. మన సినిమాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌లోనే కనిపిస్తున్నాయి. కానీ అందులోకి వెళ్లిన సినిమాలకు టాప్ 10లో స్ఠానం దక్కడం విశేషం. అందులో ఒకటి ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ కాగా, రెండోది థియేటర్‌లో విడుదలై.. ఓటీటీకి వెళ్లింది. సత్యదేవ్ నట విశ్వరూపం చూపించిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ డైరెక్ట్ రిలీజ్ సినిమా కాగా, అల్లు అర్జున్- త్రివిక్రమ్‌ల సంక్రాంతి మ్యాజిక్ ‘అల వైకుంఠపురములో..’ థియేటర్ నుంచి ఓటీటీకి వెళ్లిన సినిమా. ఈ సినిమా థియేటర్‌లో చేసిన సందడి మనకు తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో అదే రీతిలో హవా నడిపిందన్నమాట.
ఇక ‘ఉమామహేశ్వరుడి.. ఉగ్ర రూపానికి’ ఓటీటియన్స్ బాగా ఫిదా అయిపోయారు. ఇవి కాకుండా దక్షిణాది నుంచి మరో రెండు సినిమాలు కూడా టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాయి. దుల్కర్ సల్మాన్ నటించిన తమిళ చిత్రం ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లాయడితల్’, అన్నాబెన్ నటించిన మలయాళ చిత్రం ‘కప్పెలా’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వాటినీ ఓటీటియన్స్ బాగా ఆదరించారట. ఈ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది కూడా ఓటీటీల సందడి బాగానే ఉండేలా కనిపిస్తోంది.