ప్రతి సినిమా హిట్ అవ్వాలనే ప్రారంభిస్తారు. కష్టపడతారు. నిర్ణయం మాత్రం ప్రేక్షకులదే. నచ్చితే చూస్తారు. కొత్తగా అనిపిస్తే హిట్ చేస్తారు. అలా ఈ ఏడాది విజయం, అపజయం సాధించిన చిత్రాల గురించి కాసేపు పక్కన పెడితే.. అభిమానులు ఎంతగానో హోప్స్ పెట్టుకున్న కొన్ని సినిమాలు బాగా నిరాశను కలిగించాయి. స్టార్ హీరోలు, హిట్ డైరక్టర్లు, బడా నిర్మాణ సంస్థలు కాంబినేషన్లో రూపుదిద్దుకొని ఊరించిన కొన్ని ఫిల్మ్స్ ఉసూరుమనిపించాయి. ఈ ఏడాది డిజప్పాయింట్ చేసిన చిత్రాలపై ఫోకస్..
బ్రహ్మోత్సవందర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా బ్రహ్మోత్సవం. వీరిద్దరి కలయికలోవచ్చిన తొలి చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కావున ఈ కాంబినేషన్లో పీవీపీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రహ్మోత్సవం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చివరికి ఎన్నో ఆశలతో థియేటర్లకు చేరుకున్న అభిమానులను ఈ చిత్రం అలరించలేకపోయింది. ముగ్గురు హీరోయిన్లు, 25 మంది గొప్ప నటులు ఉన్నప్పటికీ ఈ మూవీ విజయతీరానికి చేరుకోలేకపోయింది.
సర్దార్ గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చిన ఉత్సాహంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సీక్వెల్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. అంతకముందు పవన్ “అత్తారింటికి దారేది” తో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్పడింది. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు బాబీ ఇది వరకు “పవర్” తో హిట్ కొట్టడం, పవన్ సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించడం వంటివి సర్దార్ గబ్బర్ సింగ్ కి మరింత హైప్ ని తీసుకొచ్చాయి. ఏప్రిల్ 8 న రిలీజ్ అయిన ఈ మూవీ విజయం అందుకోలేకపోయింది.
తిక్క
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ “పిల్ల నువ్వులేని జీవితం” తో హీరో గా నిరూపించుకున్నారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో కమర్షియల్ బాట పట్టారు. సుప్రీమ్ తో కలక్షన్ల వర్షం కురిపించి మెగా హీరో అనిపించుకున్నారు. దీని తర్వాత చేస్తున్న సినిమా కావడంతో “తిక్క” పై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. తేజ్ హ్యాట్రిక్ కొట్టేస్తారని సినీ పండితులు జోస్యం చెప్పారు. ఆగస్టు 13 న విడుదలైన ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. కథలో తల తోక లేక ఆడియన్స్ కి తిక్క పుట్టించింది.
కృష్ణాష్టమి
హాస్యనటుడు నుంచి హీరో గా ప్రమోషన్ అందుకున్న సునీల్ కి మిస్టర్ పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు నిరాశ పరిచాయి. అందుకే రెండేళ్ల విరామం తీసుకొని కృష్ణాష్టమి చిత్రాన్ని చేశారు. సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో సునీల్ హిట్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని అనుకున్నారు. ఫిబ్రవరి 19 న రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
రాజా చెయ్యి వేస్తే
ఈ ఏడాది నారా రోహిత్ హీరోగా నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో జ్యో అచ్యుతానంద కొంత ఫరవాలేదనిపించినా మిగతా మూడు నిరాశ పరిచాయి. అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసిన చిత్రం గా “రాజా చెయ్యి వేస్తే” నిలిచింది. తుంటరి, సావిత్రి అపజయాల తర్వాత నారా రోహిత్ చేసిన మూవీ కావడం, మంచి టేస్డ్ ఉన్న చిత్రాల నిర్మాతగా పేరున్న వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మించడం తో అభిమానులు ఆశగా థియేటర్ కి వెళ్లారు. వారి అంచనాలను “రాజా చెయ్యి వేస్తే” అందుకోలేక పోయింది.
ఎటాక్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగులో చిత్రాలను తీయడం తగ్గించారు. ఆయన దర్శకత్వంలో ఎప్పుడో మొదలైన “ఎటాక్” ఈ ఏడాది రిలీజ్ అయింది. క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో వర్మ దిట్ట. అయన నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచు మనోజ్ హీరోగా నటించడం, ప్రకాష్ రాజ్, జగపతిబాబులు ముఖ్య పాత్రల్లో నటించడంతో హైప్ పీక్ స్థాయిలో వెళ్లిపోయింది. సినిమా మాత్రం రొటీన్ గా ఉండడంతో చతికిల పడిపోయింది.
హైపర్
ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ ఏడాది జనవరి ఫస్ట్ న “నేను…శైలజ” తో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తనకు కందిరీగ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించారు. 14 రీల్స్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన హైపర్ పై రామ్ పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. సెప్టెంబర్ 30 రిలీజ్ అయిన ఈ చిత్రం కథ పాత చింతకాయ పచ్చడి కావడంతో ప్రేక్షకులు వెనక్కిపంపారు. ఏ విషయంలోనూ కొత్తదనం లేకపోవడంతో వారానికే బాక్స్ లు వెనక్కి వెళ్లిపోయాయి.
జాగ్వర్
ప్రపంచం మెచ్చిన బాహుబలి చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కలం నుంచి వచ్చిన మరో కథ జాగ్వర్. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి జాగ్వర్ కి స్టార్ మూవీ హోదా వచ్చింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా పరిచయం అయిన ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే క్రేజ్ సంపాదించుకుంది. నట సింహ బాలకృష్ణతో ‘మిత్రుడు’ సినిమాను రూపొందించిన మహదేవ్ దర్శకత్వంలో 75 కోట్లతో ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 6 విడుదలైన మూవీ కథ, కథనం బాగాలేక డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది.