“మల్లేశం, 8 ఏఎం మెట్రో” చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన తాజా చిత్రం “23”. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడంలో రాజ్ రాచకొండ చేయని ప్రయత్నం లేదు. కానీ.. సరైన సపోర్ట్ లేకపోవడంతో ఇబ్బందిపడుతూనే ఈ చిత్రాన్ని నేడు (మే 16) విడుదల చేశారు. మరి సినిమా సంగతేంటో చూద్దాం..!!
కథ: ఒక సిన్సియర్ లాయర్, అది కూడా ఓ అగ్ర కులస్థుడు. కానీ.. అతడికి కులం, మతం కంటే న్యాయం, మానవత్వం మీద మక్కువ ఎక్కువ. అతడి జీవితంలో చూసిన కొన్ని కీలకమైన కేసులు, ఆ కేసుల విషయంలో వ్యక్తుల ఆర్థిక, సామాజిక నేపథ్యం బట్టి న్యాయం అమలవ్వడం అన్నది ఆ సగటు లాయర్ ను ఎంతలా కలచివేసింది? అనేది సినిమా కోర్ పాయింట్.
1991 చుండూరు మారణహోమం ఘటన, 1993 చిలకలూరిపేట బస్సు దహనం ఘటన, 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ఈ మూడు విభిన్నమైన కేసుల్లో నిందితులకు ఎలాంటి శిక్షలు పడ్డాయి? వాళ్ల నేపథ్య న్యాయ వ్యవస్థని ఏ విధంగా శాసించింది? అనేది “23” సినిమాలో చర్చించిన, చూపించిన విషయాలు.
నటీనటుల పనితీరు: తేజ పోషించిన సాగర్ అనే పాత్ర చాలా బరువైనది. ఎన్నో విభిన్నమైన భావాలను పండించాలి, బాధని వ్యక్తపరచాలి, నిజాన్ని గ్రహించాలి, అలసత్వాన్ని కళ్లతో వ్యక్తీకరించాలి, ఆశావాదాన్ని ముఖంలో చూపించాలి. ఓ కొత్త నటుడికి ఇన్ని ఎమోషన్స్ ను పండించే అవకాశం రావడం చాలా అరుదు. తేజకు ఆ అవకాశం దొరికింది. చాలా కష్టపడ్డాడు కానీ.. పూర్తిస్థాయిలో పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాల్సిందే సాగర్ పాత్రతో, ఆ పాత్ర భావోద్వేగాన్ని ప్రేక్షకులు కూడా అనుభూతి చెందాలి, అప్పుడే సినిమాతో ట్రావెల్ అవుతారు. అది కాస్త లోపించిందనే చెప్పాలి.
మరో ముఖ్య పాత్రలో తన్మయి ఒద్దికగా నటించింది. ఎంతో బరువైన పాత్ర ఆమెది, వాటన్నిటినీ కొంతమేరకు బాగానే మోసింది. అ ఆపాత్రకు కావాల్సిన అమాయకత్వం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే.. చిన్నపాటి పరిణితి అవసరమైన చోట మాత్రం కాస్త తడబడింది.
సపోర్టింగ్ రోల్లో పవన్ రమేష్ మంచి రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన తప్పును అంగీకరించి, చావు కోసం ఎదురుచూసే ఓ అసమర్ధుడిగా అతడి హావభావాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎలాంటి పాత్రనైనా పోషించిన గల సత్తా ఉన్న నటుడు పవన్ రమేష్ ను చిత్రసీమ సరిగ్గా వినియోగించుకోవాలి.
చిన్న పాత్ర అయినప్పటికీ.. చాలా కీలకపాత్రలో ఝాన్సీ మెప్పించింది. తాగుబోతు రమేష్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. పోలీస్ పాత్ర పోషించిన నటుడు కూడా బాధ్యతగా నటించాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఎలాంటి పీక్ ఎమోషన్ అయినా చాలా సింపుల్ గా ఎలివేట్ చేయడంలో దర్శకుడు రాజ్ రాచకొండ సిద్ధహస్తుడు. అలాగే.. సినిమాల్ని చాలా సహజంగా తెరకెక్కిస్తుంటాడాయన. “23” చిత్రాన్ని కూడా వీలైనంత సహజంగా తెరకెక్కించాడు. రియలిస్టిక్ లొకేషన్స్ & ఎమోషన్స్ తో సినిమాలో ఆడియన్స్ లీనమయ్యేలా చేశాడు. ముఖ్యంగా ఓ మూడు సంబంధం లేని కేసులను ఓ లాయర్ పాయింటాఫ్ వ్యూలో చూపిస్తూ న్యాయ వ్యవస్థపై సంధించిన ప్రశ్నాస్త్రాలు కచ్చితంగా ఆలోచించదగినవే. అయితే.. వాటి వాడి ఉండాల్సిన స్థాయిలో లేదు. అందువల్ల ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి అనే ఉద్వేగం ప్రేక్షకుడిలో కలగదు. లేవనెత్తిన ప్రశ్న కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అయితే.. ఆ ప్రశ్నించిన విధానంలో బలమైన ఎమోషన్ మిస్ అయ్యింది.
న్యాయ వ్యవస్థ పనితనాన్ని పూర్తిస్థాయిలో ప్రశ్నించలేదు, అలాగే.. మూడు కీలకమైన సంఘటనల్లో ఆడియన్స్ కనెక్టివిటీ పాయింట్ కూడా ఉంటే సినిమాకి రిలేట్ అవ్వడమో లేక సంఘటనలకి చలించడమో జరిగేది. అలాగే.. చిలకలూరిపేట కేసులో నిందితుడు తప్పు చేశాడా లేదా అనేది నిర్ధారించకుండా అతడి న్యాయం కోసం పోరాడడం కూడా ఎందుకో సింక్ అవ్వలేదు. కోర్టులో ఉన్న కేస్ విషయంలో ఎందుకని ఒక సైడ్ తీసుకోవడం అనుకున్నాడో ఏమో కానీ.. ఒక కనెక్టివిటీ పాయింట్ మాత్రం చూపించలేకపోయాడు రాజ్ రాచకొండ. అందువల్ల ఒక ఫిలిం మేకర్ గా సహజంగా సినిమాని తెరకెక్కించడంలో విజయం సాధించినా, కథకుడిగా ప్రేక్షకుల్ని అలరించడంలో మాత్రం విఫలమయ్యాడు.
మార్క్ కె.రాబిన్ సౌండ్ కొన్ని చోట్ల అవసరమైనదానికంటే లౌడ్ గా ఉంది. అది మిక్సింగ్ సమస్య? లేక మరింకేదైనా అనేది వారికే తెలియాలి.
సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ & ప్రొడక్షన్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి.
విశ్లేషణ: సమాజాన్ని ప్రశ్నించే, ఆలోచింపజేసే సినిమాలు కచ్చితంగా రావాలి. సినిమా ద్వారా ఓ అన్యాయాన్ని ప్రశ్నించడం లేదా వ్యవస్థని ఆలోచింపజేయడం అనేది గొప్ప విషయం. అయితే.. ఆ ప్రశ్నలో సామాజిక బాధ్యతతోపాటు, దృష్టికోణం కూడా చాలా కీలకం. “23” విషయంలో ఆ దృష్టికోణంలో స్పష్టత లోపించింది. అందువల్ల న్యాయ వ్యవస్థ నిర్వహణపై అలసత్వం చెలరేగినప్పటికీ, సాగర్ మీద ఎందుకని జాలి చూపించాలి? అనే విషయంలో మాత్రం సరైన సమాధానం లేక సినిమాకి కనెక్ట్ అవ్వడానికి ఇబ్బందిపడతాం.
ఫోకస్ పాయింట్: నిజాయితీగల ప్రయత్నం!
రేటింగ్: 2/5