2019లో విడుదలై మంచి విజయం అందుకున్న “దే దే ప్యార్ దే”కి సీక్వెల్ గా రిలీజైన చిత్రం “దే దే ప్యార్ దే 2”. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ తోపాటుగా మాధవన్, మీజాన్ జాఫ్రీ ఈ సీక్వెల్ లో జాయిన్ అయ్యారు. మరి ప్రీక్వెల్ స్థాయిలో సీక్వెల్ ఆకట్టుకుందా? రకుల్ కి బాలీవుడ్ లో హిట్ దొరికిందా? అనేది చూద్దాం..!!

కథ: తనకంటే వయసులో 22 ఏళ్లు పెద్దవాడైన ఆశిష్ (అజయ్ దేవగన్)ను ప్రేమించి పెళ్లాడాలని నిశ్చయించుకున్న అయేషా (రకుల్ ప్రీత్ సింగ్)కి ప్రీక్వెల్ లో ఆశిష్ మొదటి భార్య అడ్డంకిగా నిలిస్తే.. సీక్వెల్ కి వచ్చేసరికి తన ప్రోగ్రెసిన్ తల్లిదండ్రులు రాజీ ఖురానా (మాధవన్), అంజు ఖురానా (గౌతమి కపూర్) అడ్డంకిగా నిలుస్తారు.
తనకంటే ఏడాది పెద్దవాడైన ఆశిష్ తో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి రాజ్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే.. ఆశిష్ & అయేషా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది “దే దే ప్యార్ దే 2” కథాంశం.

నటీనటుల పనితీరు: ముందుగా మాధవన్ గురించి మాట్లాడుకోవాలి. మాధవన్ తన కెరీర్లో బెస్ట్ ఫేస్ లో ఉన్నాడు. దాదాపుగా అతడు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్న పాత్రలన్నిటికీ అతను ప్లస్ పాయింట్ అవుతున్నాడు. ఈ సినిమాలోనూ ఓ తండ్రిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా “షైతాన్” సినిమాలో హీరో & విలన్ గా చూసిన అజయ్ దేవగన్ & మాధవన్ కాంబినేషన్ ను ఈ సినిమాలో మామా అల్లుళ్లుగా చూడడం అనేది కొత్తగా ఉంది. వాళ్లిద్దరి కాంబినేషన్ సీన్స్ కామెడీతోపాటు ఎమోషన్ ను కూడా బాగా వర్కవుట్ చేశాయి.
రకుల్ ప్రీత్ సింగ్ కి లాస్ట్ హిట్ సినిమా “దే దే ప్యార్ దే”నే. అప్పటినుండి దాదాపుగా ఆరేళ్లుగా ఆమెకు సరైన హిట్ సినిమా లేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమా సీక్వెల్ తోనే హిట్ కొట్టింది రకుల్. నటిగా ఆమె ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తుంది. గ్లామర్ డోస్ కాస్త పెంచాలని ప్రయత్నించింది కానీ.. అది చాలా చోట్ల ఎబ్బెట్టుగా ఉంది.
గౌతమీ కపూర్, మీజాన్ జాఫ్రీ, జావేద్ జాఫ్రీలు మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవడమే కాక.. కథనం ముందుకు వెళ్లడానికి దోహదపడ్డారు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా సినిమాను ఎందుకో చుట్టేశారు అనిపించింది. ఇదివరకు బాలీవుడ్ సినిమాలంటే లావిష్ సెట్స్, భారీ లొకేషన్స్ కనిపించేవి. అలాంటిది వాళ్లు కూడా ఇలా స్టూడియో సెట్స్ లో సినిమా మొత్తాన్ని చుట్టేయడం అనేది బాలేదు. ముఖ్యంగా మాధవన్ హౌస్ సెట్ మొత్తం చాలా అసహజంగా ఉంది. సగం సినిమా అందులోనే ఉండడం వల్ల.. ఆ వెలితి గట్టిగా కనిపించింది. సీజీ వర్క్ కూడా మరీ పేలవంగా ఉంది. ప్రొడక్షన్ టీమ్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అనేది చాలా అన్ రియలిస్టిక్ గా ఉంది. అది వాళ్లకి కేటాయించిన బడ్జెట్ ప్రాబ్లం కూడా అయ్యుండొచ్చు. కానీ.. ఒక బడా స్టార్ హీరో నటించే బాలీవుడ్ సినిమా నుండి ఇలాంటి ప్రొడక్షన్ డిజైన్ అనేది మాత్రం అస్సలు ఊహించలేదు.
పాటలు, కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ వంటి డిపార్ట్మెంట్స్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చారు. ఈమధ్యకాలంలో చూసిన మాంటేజ్ సాంగ్స్ లో ఈ సినిమాలో కనిపించిన పాటల్లో మూమెంట్స్ చాలా బెటర్.
దర్శకుడు అన్షుల్ శర్మ సింపుల్ పాయింట్ ను అనవసరంగా కాంప్లికేట్ చేశాడు. లవ్ రంజన్ ఫార్మాట్ కు అనవసరమైన మేలో డ్రామా యాడ్ చేసి ఎమోషన్ & కామెడీని మిక్స్ చేసి కంగాళీ చేసేసాడు. అందువల్ల.. సినిమా సాగుతూనే ఉంటుంది. కొంతమేరకు కామెడీ ఎంజాయ్ చేసినప్పటికీ.. లేనిపోని ట్విస్టులు యాడ్ చేసి సీరియల్ లా సాగదీశాడు. అందువల్ల.. సినిమా చూస్తున్నంతసేపు ఇంకెప్పుడు అయిపోతుందా? అని ఆలోచిస్తూ ఉంటాం. ఒక ప్రేక్షకుడు అలా ఫీలయ్యాడంటే.. దర్శకుడిగా అన్షుల్ శర్మ అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: ఒక కంటెంపరరీ కథ చెబుతున్నాం అనే ఆలోచన ఉన్నప్పుడు మేకర్స్.. ఒక్క కోర్ పాయింట్ విషయంలోనే కాక కథనం విషయంలోనూ ఆ నవ్యత చూపించాలి. అలా కాకుండా ఏదో కొత్తగా చెబుతున్నాం అనుకుని.. పాత చింతకాయ పద్ధతి ఫాలో అయితే “దే దే ప్యార్ దే 2” లాంటి సినిమా అవుతుంది. టైమ్ పాస్ కోసం చూడొచ్చు కాని.. ఇంకాస్త మెచ్యూర్డ్ గా డీల్ చేసి ఉంటే ఆడియన్స్ కి ఇంకాస్త మంచి ఎక్స్ పీరియన్స్ వచ్చి ఉండేది.

ఫోకస్ పాయింట్: బాలీవుడ్ మ్యాజిక్ మిస్ అవుతోంది!
రేటింగ్: 2/5
