రాజీవ్ కనకాల, ప్రమోదిని, నాట్య రంగ తదితరులు (Cast)
అనీష్ (Director)
విజయ్ ఎం.రెడ్డి (Producer)
ఆనంద్ రాజావిక్రమ్ (Music)
హర్షవర్ధన్ (Cinematography)
శరత్ కుమార్ (Editor)
Release Date : నవంబర్ 14, 2025
భావప్రీత ప్రొడక్షన్స్ (Banner)
తెలుగు మూలాలు ఉన్న కన్నడ నటుడు/దర్శకుడు అనీష్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “లవ్ OTP”. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని కొన్ని సన్నివేశాలు తెలుగులో రీషూట్ చేసి.. బైలింగువల్ అంటూ రెండు భాషల్లో ఏకకాలంకా విడుదల చేశారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
Love OTP Movie Review
కథ: తండ్రి భయం వల్ల కనీసం అమ్మాయిలతో మాట్లాడడానికి కూడా భయపడే అక్షయ్ (అనీష్).. ఊహించని విధంగా ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. ఒకమ్మాయిని ప్రేమించాల్సి వస్తే, మరో అమ్మాయిని మనసారా ప్రేమిస్తాడు.
ఈ ఇద్దరి మధ్యలో అక్షయ్ ఎలా నలిగిపోయాడు. ఈ ప్రేమ అక్షయ్ కెరీర్ అయిన క్రికెట్ ను ఎలా దెబ్బతీసింది? వాటి నుండి అక్షయ్ ఎలా బయటపడ్డాడు? అనేది “లవ్ OTP” కథాంశం.
నటీనటుల పనితీరు: ఆల్రెడీ కన్నడలో హీరోగా ప్రూవ్ చేసుకున్న అనీష్ కి ఈ సినిమాలోని అక్షయ్ క్యారెక్టర్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కూడా బాగున్నాయి. అన్నిటికీ మించి కంగారుపడుతున్నట్లుగా ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కి జనాలు భలే నవ్వుకుంటారు. హావభావాల మీద ఇంకాస్త వర్క్ చేస్తే తెలుగులోనూ హీరోగా సెటిల్ అవ్వగలుగుతాడు.
హీరోయిన్లు ఇద్దరూ కన్నడ అమ్మాయిలు కావడంతో.. వారి పాత్రలు ఎంగేజింగ్ గా ఉన్నా, కనెక్ట్ అవ్వలేం. కనీసం ఒక్క తెలుగమ్మాయి ఉన్నా బాగుండేది అనిపించింది. ముఖ్యంగా నక్షత్ర పాత్రకి.
రాజీవ్ కనకాల స్ట్రిక్ట్ ఫాదర్ గా కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ.. ఆ కామెడీ పూర్తిస్ధాయిలో వర్కవుట్ అవ్వలేదు. ప్రమోదిని తల్లి పాత్రలో మెప్పించింది. మిగతా కన్నడ ఆర్టిస్టులు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: హీరో అనీష్ ఈ చిత్రానికి దర్శకుడు కూడా కావడం వల్ల.. అందరి పాత్రలకంటే తన పాత్ర మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అందువల్ల.. మిగతా పాత్రల తాలూకు ఇంపాక్ట్ మిస్ అయ్యింది. అయితే.. లవ్ ట్రయాంగిల్ సిచ్యుయేషన్స్ ను కంపోజ్ చేసిన విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అబ్బాయిలు సదరు సన్నివేశాలకు బాగా కనెక్ట్ అవుతారు. అందులోనూ ఇటీవలే “గర్ల్ ఫ్రెండ్” సినిమా చూసి టాక్సిక్ రిలేషన్ లో అబ్బాయిలే విలన్స్ అన్నట్లుగా చూసిన ఆడియన్స్.. “లవ్ OTP” చూసి అమ్మాయిల బిహేవియర్ తక్కువేమీ కాదు అన్నట్లుగా ఉంటుంది. అందువల్ల అబ్బాయిలు ఫుల్ ఖుష్ అవుతారు. ఆ రకంగా చూస్తే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు అనీష్. కాకపోతే.. సందర్భాలను ఇంకాస్త న్యూట్రల్ గా రాసుకుని ఉంటే రచయితగానే సక్సెస్ అయ్యేవాడు.
పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ.. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.
విశ్లేషణ: ఇది కన్నడ సినిమా.. తెలుగులో డబ్బింగ్ చేశామని సినిమా టీమ్ ముందే క్లారిటీగా చెప్పాల్సింది. బైలింగువల్ అని చెప్పడం వల్ల లిప్ సింక్ లేనప్పుడు కొంచం చిరాకొస్తుంది. ఆకట్టుకోలేని పాటలు, తెలియని కన్నడ నటీనటులు వంటి మైనస్ పాయింట్స్ ను పక్కన పెడితే.. రెండు గంటలపాటు హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు. ముఖ్యంగా అమ్మాయిల టార్చర్ ఎపిసోడ్స్ కు అబ్బాయిలు భలే కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా.. “లవ్ OTP” అనేది డీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.