గోల్డెన్ కారవాన్ - ఎస్.కె గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ (Banner)
ఓటీటీ ఆడియన్స్ లో “ఢిల్లీ క్రైమ్” వెబ్ సిరీస్ గురించి తెలియనివారు, చూడనివారు ఉండరు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇండియన్ వెబ్ సిరీస్ ఫార్మాట్ కి సరికొత్త యాంగిల్ తీసుకొచ్చిన కంటెంట్ ఇది. ఇండియాని వణికించిన ఢిల్లీ అత్యాచార ఘటనను వీలైనంత సబ్టల్ గా డీల్ చేసిన ఏకైక వెబ్ సిరీస్ ఇదే. అందుకే సెకండ్ సీజన్ కూడా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు 3వ సీజన్ రిలీజైంది. గర్ల్ ట్రాఫికింగ్ నేపథ్యంలో హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ లిమిటెడ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ మునుపటి సీజన్ల స్థాయిలోనే ఉందా లేదా అనేది చూద్దాం..!!
Delhi Crime Season 3 Review
కథ: అస్సాం నుండి ఒక ట్రక్ లో వెపన్స్ వస్తున్నాయి అని టిప్ అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్ ను ఆపుతుంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వర్తిక (షెఫాలి షా). అయితే.. ఆ ట్రక్ లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతారు అందరూ.
అయితే.. మరో 40 మంది అమ్మాయిలు ఉన్న ట్రక్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్లిందని తెలుసుకున్న వర్తిక వారిని కాపాడడం కోసం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఢిల్లీ చేరుకుంటుంది. అక్కడ తన రెగ్యులర్ టీమ్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన వర్తిక & టీమ్ కి ఈ దందా కారణంగా ఎన్నో వందలమంది ఆడపిల్లలు తమ జీవితాల్ని కోల్పోయారని.. అంతటికీ కారణం బడి దీదీ (హ్యుమా ఖురేషి) అని తెలుసుకుంటారు.
అలా మొదలైన ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వెళ్లింది? ఈ క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటి? చివరికి ఆడపిల్లల్ని కాపాడగలిగారా? లేదా? అనేది “ఢిల్లీ క్రైమ్ సీజన్ 3” కథాంశం.
నటీనటుల పనితీరు: హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడం సీరీస్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.
హ్యుమా ఖురేషి ఈ సిరీస్ లో బడీ దీదీగా టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఆమె కళ్ళల్లో క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్ లో పొగరు బాగా క్యారీ చేసింది.
షెఫాలి షా ఎప్పట్లానే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా క్యారెక్టర్ లో జీవించేసింది. క్రిమినల్స్ & విక్టిమ్స్ మైండ్ సెట్ కి ఆమె రియాక్ట్ అయ్యే విధానం ఆడియన్స్ కి భలే కనెక్ట్ అవుతుంది.
ఇటీవలే “K-ర్యాంప్”తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్ లో ఒక మంచి పాత్రలో ఆకట్టుకుంది. దూకుడు స్వభావం గల లేడీ పోలీస్ గా ఆమె క్యారెక్టర్ సిరీస్ కి ఒన్నాఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు. రసికా దుగ్గల్ కూడా మంచి నటనతో సిరీస్ కి ఎమోషన్ యాడ్ చేసింది.
మిగతా పాత్రధారులందరూ తమదైన శైలి నటనతో సిరీస్ కి ప్లస్ అయ్యారు.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా వేలెత్తి చూపడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వలేదు టీమ్. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, సీజీ, కాస్ట్యూమ్స్ వంటివన్నీ అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా కలర్ టోన్ అనేది ఆడియన్స్ ను కంటెంట్ కు తగ్గ మూడ్ లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించింది.
దర్శకుడు తనూజ్ చోప్రా తెలిసిన మరియు చాలాసార్లు చూసేసిన టాపిక్ నే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ.. సెంటిమెంట్స్ ను బాగా పండించాడు. అయితే.. మరీ స్ట్రయిట్ & సింపుల్ స్క్రీన్ ప్లే అయిపోవడం అనేది మంచి కిక్ ఇవ్వలేకపోయింది. ఈ తరహా సిరీస్ లు చూసేదే నెక్స్ట్ ఏమవుతుందా అనే టెన్షన్ తో. అలాంటిది ఆ టెన్షన్ ను క్రియేట్ చేయడంలో విఫలమయ్యాడు తనూజ్. డ్రామాలా ఈ సిరీస్ ను నడిపించడం అనేది మైనస్ అని చెప్పాలి.
విశ్లేషణ: ఒక వెబ్ సిరీస్ లేదా సినిమా చూస్తున్నప్పుడు చివరికి సుఖాంతం అవ్వాలి అనుకుంటూనే చూస్తాం. ఒక్కోసారి ఆ ఎండింగ్ సుఖాంతం అవ్వకపోయినా కంటెంట్ లో దమ్ము ఉంటే జనాలు యాక్సెప్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే.. థ్రిల్లింగ్ డ్రామాలా సాగాల్సిన ఒక సిరీస్ ను ప్యూర్ డ్రామాలా నడిపించడం అనేది ఢిల్లీ క్రైమ్ సీజన్ 3కి మెయిన్ మైనస్. పెర్ఫార్మెన్సులు, టెక్నికాలిటీస్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఎందుకో ఈ సిరీస్ మునుపటి సీజన్ల స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఆ విషయంలో మేకర్స్ ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.