35 Chinna Katha Kaadu Review in Telugu: 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 5, 2024 / 07:42 AM IST

Cast & Crew

  • విశ్వదేవ్ రాచకొండ (Hero)
  • నివేదా థామస్ (Heroine)
  • ప్రియదర్శి, కృష్ణతేజ, అరుణ్ దేవ్ తదితరులు.. (Cast)
  • నందకిషోర్ ఈమని (Director)
  • సిద్ధార్థ్ రాళ్లపల్లి - సృజన్ యరబోలు (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • నికేత్ బొమ్మి (Cinematography)

గత కొన్ని రోజులుగా చిన్న సినిమాగా పెద్ద హడావుడి చేస్తున్న చిత్రం “35” ట్యాగ్ లైన్ “చిన్న కథ కాదు”. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఈమని దర్శకుడు. విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలవుతుండగా.. సినిమా మీద నమ్మకంతో రెండ్రోజులు ముందుగానే అనగా.. 4వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు చిత్రబృందం.

రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం మీద బృందానికి ఉన్న నమ్మకానికి ఈ రెండ్రోజుల ముందు ప్రీమియర్ ప్రతీక అనుకోవాలి. మరి వారి నమ్మకం సినిమాకి ప్లస్ అయ్యిందా? ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? అనేది చూద్దాం..!!

35 Chinna Katha Kaadu Review

కథ: తిరుపతిలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబమైన ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) & సరస్వతి (నివేదా థామస్)ల మొదటి కుమారుడు అరుణ్ (అరుణ్ దేవ్). అరుణ్ ప్రతి విషయానికి లాజికల్ సమాధానాలు వెతుకుతూ ఉంటాడు. తన ప్రశ్నకి సమాధానం దొరికినప్పుడే ఆ సబ్జెక్ట్ మీద పూర్తి దృష్టి సారించి ఆస్వాదిస్తూ చదువుతాడు. అటువంటి అరుణ్ గాడికి మ్యాథ్స్ అనేది పెద్ద క్వాశ్చన్ మార్క్. సున్నాకి వేల్యూ ఎందుకు లేదు అనే ప్రశ్నకి సమాధానం ఏ మ్యాథ్స్ టీచర్ చెప్పకపోవడంతో.. మ్యాథ్స్ లో మాత్రం సున్నా మార్కులు తెచ్చుకొని మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అవుతుంటాడు.

అయితే.. స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన మ్యాథ్స్ టీచర్ చాణక్య (ప్రియదర్శి)కి అరుణ్ అడిగే లాజికల్ ప్రశ్నలు నచ్చవు. దాంతో ఆరో తరగతిలో ఫస్ట్ బెంచ్ లో స్నేహితుడు పవన్ తో కూర్చునే అరుణ్ ని తీసుకెళ్లి అయిదో తరగతిలో లాస్ట్ బెంచ్ లో పడేస్తాడు. అయితే.. అరుణ్ గనుక మ్యాథ్స్ లో కనీసం 35 మార్కులు తెచ్చుకోకపోతే స్కూల్ నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని 10వ తరగతి కూడా పాస్ అవ్వని తల్లి సరస్వతి చేయూతతో అరుణ్ ఎలా అధిగమించాడు అనేది “35 చిన్న కథ కాదు” కథాంశం.

నటీనటుల పనితీరు: ఓ బ్రాహ్మణ కుటుంబంలోని ఆడపడుచు ఎలా నడుచుకుంటుందో అచ్చుగుద్దినట్లుగా అదే విధంగా కట్టు, బొట్టు, వాచకం వంటి అన్ని విషయాల్లో ఒదిగిపోయింది నివేదా థామస్. పిల్లల ఎదుగుదల కోసం పరితపించే తల్లిగా, భర్త లాలనగా కోసం ఆతృతగా ఎదురుచూసే భార్యగా ఆమె నటన 100 మార్కులు వేయాల్సిందే. ఒక మలయాళీ క్రిస్టియన్ అమ్మాయి అయ్యుండి.. బ్రాహ్మణ పాత్రలో అంత హుందాగా ఒదిగిపోవడం అనేది అభినందించాల్సిన విషయం. విశ్వదేవ్ ఎప్పుడో 2016లో హీరోగా “పిట్టగోడ” సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈ సినిమాలో పోషించిన ప్రసాద్ అనే పాత్ర అతడికి మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి.

ఇద్దరు పిల్లల తండ్రిలా కనిపించకపోయినప్పటికీ.. నటుడిగా మాత్రం చక్కని హావభావాలతో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి మరో ఆసక్తికరమైన పాత్రలో జీవించేశాడు. మ్యాథ్స్ టీచర్ చాణక్యగా అతడి నటనకు చాలా మంది రిలేట్ అవుతారు. ముఖ్యంగా.. మ్యాథ్స్ సబ్జెక్టు పేరు వింటేనే వణికిపోయే వాళ్ళందరూ ప్రియదర్శి పాత్రను తిట్టుకుంటారు, ఆ పాత్రలో అతడి నటనకు తార్కాణమది. గౌతమిది అతిథి పాత్రే అయినప్పటికీ.. సెకండాఫ్ లో ఆమె క్యారెక్టర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కృష్ణ తేజ ఉన్న కొద్దిపాటి నిడివిలో ఆకట్టుకోగలిగాడు. సీనియర్ దర్శకులు, నటులు భాగ్యరాజ్ పాత్రకు మంచి వేల్యూ యాడ్ చేసారు. ఇక అరుణ్ శర్మ గా నటించిన అరుణ్ దేవ్ తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

సాంకేతికవర్గం పనితీరు: నూటికి తొంబై మందికి లెక్కలంటే లెక్కించలేనంత భయం. సబ్జెక్ట్ రాక భయపడేవారి కంటే అర్థం కాక భయపడేవారి సంఖ్య ఎక్కువ. ఆ మోస్ట్ రిలేటబుల్ కాన్సెప్ట్ ను కథగా ఎంచుకొన్న దర్శకుడు నందకిషోర్, ఈ కాన్సెప్ట్ కు అత్యంత అపురూపమైన అమ్మ ప్రేమను కలగలిపి మరింత సెన్సిబుల్ గా మలిచాడు. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అంత సులభమా అని అందరూ ముక్కున వేలేసుకునే రీతిలో ఉంది సినిమాలో నివేదా థామస్ తన కొడుక్కి మ్యాథ్స్ నేర్పించే పద్దతి. అలాగే.. నివేదా థామస్ పాత్రతో పండించిన ఎమోషన్స్ కూడా అద్భుతంగా వర్కవుటయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె ఆత్మ సంతృప్తితో భర్తను హత్తుకునే సన్నివేశం చాలా బాగా పండింది.

అదే విధంగా ప్రియదర్శి పాత్రను కటువుగా ప్రెజెంట్ చేసిన తీరు కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ను చక్కగా సస్టైన్ అయ్యేలా చేసింది. అయితే.. ఫస్టాఫ్ విషయంలో కూడా దర్శకుడు మ్యాథ్స్ టీచర్ చాణక్యలానే కాస్త కటువుగా వ్యవహరించి, మెయిన్ పాయింట్ ను ఎలివేట్ చేయడం కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా ఉంటే బాగుండేది. హిందీలో కొన్నేళ్ల క్రితం వచ్చిన “చిల్లర్ పార్టీ” ఛాయలు సినిమాలు అక్కడక్కడా కనిపించినా.. తిరుపతి నేటివిటీ ఆ చిన్నపాటి కంపేరీజాన్ని కొట్టిపారేసింది.

ఈ సినిమాకి మరో హీరో వివేక్ సాగర్, తనదైన సంగీతంతో సినిమాకి ప్రాణ ప్రతిష్ట చేశాడు. ప్రతి బంధాన్ని, ప్రతి ఎమోషన్ ను వివేక్ తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన విధానం గుండెకు హత్తుకుంటుంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాలో ఆడియన్స్ లీనమవ్వడానికి ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ నిర్మాతల నమ్మకానికి ప్రతీకగా నిలిచాయి.

విశ్లేషణ: తెలుగులో కాన్సెప్ట్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి, వచ్చినా ఇలా కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు ఇంకా తక్కువగా వస్తుంటాయి. ఆ లోటును తీర్చిన సినిమా “35”. నివేదా థామస్ అత్యద్భుతమైన నటన, దర్శకుడు నందకిషోర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ను నేర్పిస్తూ ఎమోషన్స్ ను అత్యంత సహజంగా పండించిన విధానం, వివేక్ సాగర్ సంగీతం థియేటర్లలో ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా మీ పిల్లలతో థియేటర్లలో చూడాల్సిందే. పొరపాటున ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలో చూడకుండా..

ఎప్పుడో ఓటీటీలో వచ్చిన తర్వాత చూసి “అరెరే మంచి సినిమా మిస్ అయ్యామే!” అని అప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టడాలు గట్రా చేయకుండా థియేటర్లో చూసి.. ఇటువంటి మరిన్ని మంచి సినిమాలు అందించాలనే ఉత్సాహాన్ని దర్శకనిర్మాతలకు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు మన ప్రపంచంలోనే ఉత్తమమైన తెలుగు ప్రేక్షకుల మీద ఉంది.

ఫోకస్ పాయింట్: చిన్న కథ కాదు.. అందరూ చూడాల్సిన పెద్ద కథ!

రేటింగ్: 3/5

Click Here to Read In ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus