టాలీవుడ్ టాప్ హీరో రవితేజ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ హీరో. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కమర్షియల్ గా అయితే ఈ సినిమా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఈ హీరో ‘రావణాసుర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ‘రావణాసుర’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మొదట ఎలాంటి సెట్స్ వేయకుండా రియల్ లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించాలనుకున్నారు.
అయితే ఇప్పుడు క్లైమాక్స్ కోసం ఓ భారీ సెట్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారట. ఈ సెట్ లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయ పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రకారం మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడలను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఈ ఐదుగురు పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాల్లో నటిస్తున్నారు.
వీటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే మెగాస్టార్ నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో హీరో తమ్ముడి పాత్రలో కనిపించనున్నారు రవితేజ. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.