టాలీవుడ్ స్థాయిని అమాంతంగా పెంచేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి మార్కెట్ వాల్యూ ఎంత పెరుగుతున్నా కూడా మన హీరోలను వదలడం లేదు. అతను తలచుకుంటే బాలీవుడ్ బడా స్టార్స్ తో పాటు హాలీవుడ్ తారలు కూడా డేట్స్ ఇవ్వగలరు. అంత ఛాన్స్ ఉన్నప్పటికీ మన హీరోలను వదలడం లేదు. పైగా వారి మార్కెట్ కూడా పెరిగేలా చేస్తూ భవిష్యత్తు తెలుగు సినిమాలపై నమ్మకం పెంచుతున్నాడు. ఇక మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బడ్జెట్ పై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
ఏకంగా RRR కంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. RRR కు నిర్మాత DVV దానయ్య అయినప్పటికీ రాజమౌళి కూడా పాట్నర్ గా ఉన్నాడన్నది కొంత వరకు వాస్తవమే. ఇక ఆ సినిమా బడ్జెట్ దాదాపు 450కోట్లకు ఫిక్స్ చేసుకున్నట్లు ఓపెన్ గానే చెప్పారు.ఇక KL నారాయణ నిర్మాతగా మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు అంతకుమించి అనేలా 500కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి. కేవలం మహేష్ ఒక్కడి మీదే ఆ స్థాయిలో బడ్జెట్ పెడుతున్నారు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.
ఇక RRR లో రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాకు వచ్చే రిజల్ట్ ను బట్టి కూడా జక్కన్న స్థాయి పెరగవచ్చు. ముందస్తు నమ్మకంతో ఏమైనా ఆ బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారా లేక కథను బట్టి ఫిక్స్ చేసుకున్నారా అన్నది ప్రధాన సందేహాలు. మరి ఈ కన్ఫ్యూజన్ పై క్లారిటీ రావాలి అంటే ఈ ఎడాది తుది వరకు ఎదురుచూడాల్సిందే.