సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఒకప్పటి స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కళ్ళను చూస్తే చాలు తను ఎవరో గుర్తుపట్టేయొచ్చు. తను మరెవరో కాదు, తన అభినయంతో, అద్భుతమైన నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన అలనాటి తార శోభన.1970, మార్చి 21న కేరళలో జన్మించిన ఈమె… 1980లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరితోనూ తను సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా బాలకృష్ణతో ‘నారీ నారీ నడుమ మురారి’, చిరంజీవితో ‘రౌడీ అల్లుడు’ వంటి చిత్రాలు తనకు తెలుగులో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.కేవలం తెలుగులోనే కాకుండా, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి 200కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత, శోభన తనకెంతో ఇష్టమైన శాస్త్రీయ నృత్యంపై పూర్తి దృష్టి సారించింది. ప్రస్తుతం తను చెన్నైలో ‘కళార్పణ’ పేరుతో ఒక డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తుంది. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె, ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ, ఎంతో మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుంది. తన డ్యాన్స్ వీడియోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
శోభన నటనకు, కళారంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం తనను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించింది. 2006లో తనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇటీవల, 2025లో పద్మభూషణ్ అవార్డు సైతం వరించింది.55 ఏళ్ల వయసు వచ్చినా శోభన ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. అయితే, 2011లో తను ఒక పాపను దత్తత తీసుకుని సింగిల్ మదర్‌గా కొత్త బాధ్యతలను స్వీకరించింది. అలాగే అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తుంది. గత ఏడాది వచ్చిన ‘కల్కి 2898 ad’ లో కీలక పాత్ర పోషించిన శోభన ఇటీవల మోహన్‌లాల్‌తో కలిసి ‘తుడరుమ్’ అనే సినిమాలో కూడా నటించింది.