మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఒక సీన్ ఇప్పుడు నిజజీవితంలో రిపీట్ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఆ సినిమాలో విలన్ సముద్రఖని బ్యాంకుల వద్ద ఏకంగా వేల కోట్ల అప్పు చేస్తాడు. అది కట్టకుండా దర్జాగా తిరుగుతాడు. అతను అప్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం నుండి రుణమాఫీ పథకం అమలయ్యేలా చేసుకుని.. తన అప్పు తీర్చుకుంటాడు.
ఇప్పుడు ఇదే సీన్ ఓ టాలీవుడ్ నిర్మాత విషయంలో రిపీట్ అయ్యింది. ఆ నిర్మాత మరెవరో కాదు టి.సుబ్బిరామిరెడ్డి. టాలీవుడ్లో ఈయనకి ‘జల్సా రాయుడు’ అనే మరో పేరు కూడా ఉంది. గతంలో పలు సినిమాలు నిర్మించారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. వ్యాపారాల్లో కూడా సక్సెస్ అయ్యారు. గతంలో ‘గాయత్రీ ప్రాజెక్ట్స్’ పేరుపై నిర్మాణ రంగం పనులు నిర్వహించేవారు. నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించి ఇది బాగా సక్సెస్ అయ్యింది.
అయితే తర్వాత ఆర్థిక నిర్వహణలో లోపాలు, సబ్–కాంట్రాక్టుల ద్వారా ముందస్తు వసూళ్లు, అసమర్థ నిర్వహణ కారణంగా కంపెనీ వంటి ఇతర కారణాల వల్ల కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మొత్తంగా ఈ కంపెనీపై రూ.8,100 కోట్ల అప్పు ఉంది. అది తీర్చలేము అని టి.సుబ్బిరామిరెడ్డి చేతులెత్తేశారు. ఈ క్రమంలో కంపెనీని వేలం వేసేందుకు కూడా బ్యాంకులు రెడీ అయ్యాయి.
అందుకు టి.సుబ్బిరామిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. అయితే ఇప్పుడు బ్యాంకులు కూడా చేతులెత్తేసి.. 70 శాతం రుణమాఫీ చేయడానికి రెడీ అయిపోయారు. అంటే రూ.5,700 కోట్లు రుణ మాఫీ చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు కేవలం రూ.2,400 కోట్లతో వన్–టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. అందుకు సుబ్బిరామిరెడ్డి అండ్ ఫ్యామిలీ వెంటనే ఓకె చేసేసినట్టు తెలుస్తుంది.
ఇలాంటి వెసులుబాటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు చాలా ఆత్మహత్యల కేసులు తగ్గుతాయి. టి.సుబ్బిరామిరెడ్డి వంటి పెద్దవాళ్ళని మాత్రమే బ్యాంకులు ఇలా ఎందుకు కనికరిస్తాయో మరి..!