ఒక రంగంలో ప్రవేశించాలంటే దానిపై అవగాహన ఉంటే సరిపోతుంది. రాణించాలంటే మాత్రం కృషి పట్టుదలతో పాటు కొంత సపోర్ట్ ఉండాలి. మార్గదర్శకులు ఉంటే తప్పులు చేయకుండా ముందుకు దూసుకు వెళ్లవచ్చు. తాతో, తండ్రో మంచి స్థాయిలో ఉంటే ఇక ఆ రంగంలో తిరుగుండదు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిన తొలి నాళ్లలో రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి కొంతమంది పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమలో కీలక వ్యక్తులుగా ఎదిగారు. అప్పుడు వేసిన బాట ఇప్పుడు వారి వారసులకు ఉపయోగ పడుతోంది. ఆ కుటుంబ సభ్యులు సులువుగా సినిమాల్లోకి రావడమే కాదు .. పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పిల్లర్లగా ఉన్న ఆ కుటుంబాల గురించి..
నందమూరి వంశం
నందమూరి తారక రామరావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకుని వెండి తెర పై ఒక వెలుగు వెలగడమే కాదు, ముఖ్య మంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. నట వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ వచ్చారు. తర్వాత మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్నలు హీరోలుగా అడుగుపెట్టారు. ఇప్పుడు ముని మనవళ్లు కూడా మేకప్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నందమూరి కుటుంబానికి చెందిన కొంతమంది సినీ నిర్మాణ రంగంలోనూ ఉన్నారు. ఈ ఫ్యామిలీ కంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.
అక్కినేని ఫ్యామిలీ
క్రమశిక్షణకు మారు పేరు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండి పిల్లలకు మంచి బాట వేసారు. కొడుకుల్లో వెంకట్ నిర్మాతగా మారగా.. నాగార్జున మన్మధుడిగా ఎదిగారు. ఏఎన్ఆర్ మనవళ్లు సుమంత్, నాగ చైతన్య, సుశాంత్, అఖిల్ హీరోగా ప్రవేశించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించి .. స్టార్ వారసురాలిగా నిరూపించుకున్నారు. ఏఎన్ఆర్ నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియో చిత్రాల చిత్రీకరణకు గొప్ప ప్రాంతంగా పేరు గాంచింది.
దగ్గుబాటి కుటుంబం
మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు అంటే భారత దేశంలోని చిత్రపరిశ్రమల్లో తెలియని వారుండరు. ఆయన 14 భాషల్లో సినిమాలు తీసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. రామానాయుడు వారసుల్లో ఒకరు సురేష్ బాబు నిర్మాతగా తండ్రి బాటలో నడిచారు. మరొకరు వెంకటేష్ విజవంతమైన సినిమాలు తీస్తూ విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. రామానాయుడు మనవళ్లు రానా, అభిరాంలు చిత్ర రంగంలో అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో సురేష్ బాబు కీలక వ్యక్తిగా ఉన్నారు.
ఘట్టమనేని వంశం
సాహసాల పడవ పై సినీ సముద్రాన్ని దాటిన హీరో ఘట్టమనేని కృష్ణ. ఒక వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగా సినిమాలు నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్ళారు. ఆయన పెద్ద కొడుకు రమేష్ తొలుత కథానాయకుడిగా సినిమాల్లో నటించారు. తర్వాత నిర్మాతగా మారారు. కృష్ణ స్టార్ హోదాను పూర్తిగా అందిపుచ్చుకున్న వారసుడు మహేష్ బాబు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. కృష్ణ కుమార్తెలో ఒకరైన మంజుల నటిగా, నిర్మాతగా నిరూపించుకున్నారు. మహేష్ బాబు కొడుకు గౌతంకృష్ణ కూడా వెండితెరపై కనిపించి .. భవిష్యత్ సూపర్ స్టార్ తానేనని చెప్పకనే చెప్పాడు.
కొణిదెల ఫ్యామిలీ
మూడు దశాబ్దాలుగా వెండితెరను ఏలిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. వీరి ఫ్యామిలీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను రఫ్ ఆడేస్తోంది. చిరు పెద్ద తమ్ముడు నాగేంద్ర బాబు ప్రొడ్యూసర్ గా అనేక సినిమాలు తీసారు. ఇప్పుడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్, నాగేంద్ర బాబు కొడుకు వరుణ్ తేజ్, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు. నాగేంద్ర బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండో తరం హీరోగా చిరు వచ్చినా.. ఆయన కుటుంబం నుంచి ఎక్కువమంది స్టార్లుగా ఎదిగారు.
మంచు కుటుంబం
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముక్కు సూటి మనిషి. ప్రశ్నించే తత్వం కలిగిన నటుడు. అసిస్టెంట్ డైరక్టర్ గా అడుగుపెట్టి విలన్ పాత్రలు చేస్తూ హీరోగా మారి.. నిర్మాతగా నిలదొక్కుకున్నాడు. అయన పిల్లలు లక్ష్మి ప్రసన్న, విష్ణు, మనోజ్ లు సినీ రంగంలో ప్రవేశించి మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించారు. సినిమానే లోకంగా వీరి కుటుంబం జీవిస్తోంది
అల్లు వారి కుటుంబం
తొలి తరం హాస్యనటుడు అల్లు రామలింగయ్య. ఆయన కుమారుడు అల్లు అరవింద్ కొన్ని సినిమాలో నటించినా నిర్మాణం వైపు అడుగులు వేసారు. నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేష్) తండ్రి బాటలో పయనిస్తుంటే, రెండో కుమారుడు అల్లు అర్జున్ (బన్నీ), చిన్న కొడుకు శిరీష్ లు మాత్రం తాత నట వారసత్వాన్ని అందుకున్నారు. హీరోలుగా బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నారు. తెర వెనుక, తెర ముందు వీరి కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది.