బాలీవుడ్ రీసెంట్ టైమ్‌లో చూడని భారీ విజయం అందించిన సినిమా ‘స్త్రీ 2’ (Stree 2). శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సుమారు రూ. 900 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అని మీకు అనుకోవచ్చు. ఆ సినిమా ఇచ్చిన విజయం ఆధారంగా అలాంటి సినిమాలు ఒకటి కాదు రెండు కాదదు ఏకంగా ఎనిమిది సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ మడాక్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
‘స్త్రీ’, ‘భేడియా’ (Bhediya), ‘రూహి’ లాంటి హారర్ (Horror Movies) బ్లాక్‌బస్టర్ సినిమాలకు మడాక్ ఫిల్మ్స్ సీక్వెల్స్‌ను అనౌన్స్ చేసింది. వీటితోపాటు మరికొన్ని హారర్ మూవీస్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దినేశ్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ వర్షాన్ని మరికొన్నాళ్లు కొనసాగించే ప్రయత్నమే ఈ ప్రకటన అని చెప్పొచ్చు. అనౌన్స్ అయిన సినిమాల లిస్ట్‌లో కొన్ని ఇప్పటికే అనౌన్స్ కాగా.. కొన్ని ఇప్పుడు చెప్పారు.
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana), రష్మిక మందన (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోత్ధార్ తెరకెక్కిస్తున్న ‘థామా’ ఈ లిస్ట్‌లో ఉంది. దీపావళికి ఈ సినిమాను తీసుకొస్తారు. వరుణ్ ధావన్ (Varun Dhawan) మరోసారి తోడేలు అవతారం ఎత్తబోతున్నాడు. ‘భేడియా’ సినిమాకు కొనసాగింపుగా ‘భేడియా 2’ సినిమా రాబోతుంది. 2026 ఆగస్టు 14న తీసుకొస్తారు. గతేడాది బాగా భయపెట్టిన ‘ముంజ్యా’కు సీక్వెల్‌గా డిసెంబరు 24, 2027న ‘మహా ముంజ్యా’ వస్తుంది.
‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఓ ఊరినే భయపెట్టిన ‘స్త్రీ’, ‘స్త్రీ 2’ సినిమాలకు కొనసాగింపుగా ఆగస్టు 13, 2027న మూడో ‘స్త్రీ 3’ రాబోతోంది. ఆలియా భట్ (Alia Bhatt) కూడా ఈ జోనర్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రధాన పాత్రలో ‘చాముండ’ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను డిసెంబరు 4, 2026న తీసుకొస్తారు. వీటితోపాటు ‘శక్తి శాలిని’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 31న వస్తుంది. ఆగస్టు 11, 2028న ‘పెహ్లా మహాయుద్ధ్’ సినిమాను తీసుకొస్తారట. అదే ఏడాది అక్టోబరు 18న ‘దూస్రా మహాయుద్ధ్’ సినిమా వస్తుంది.