భారతీయ చలన చిత్ర పరిశ్రమ ముఖ చిత్రాన్ని బాహుబలి మార్చివేసింది. ఈ మూవీ తెలుగువారు అందరూ గర్వపడేలా చేసింది. విజయ గర్వంతో ఎగిరిపడేవారిని నేల మీదా కూర్చోబెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ వారికీ నిద్ర లేకుండా చేసింది. ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమా అయి ఉండి హిందీ స్ట్రైట్ సినిమా రికార్డులను బాహుబలి కంక్లూజన్ చెరిపి వేసింది. ఇంకా ఎన్నో పాఠాలను నేర్పించింది. అవి ఏమిటంటే..
కంటెంట్ ఉండాలి భాష ఏదనేది ముఖ్యం కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారని బాహుబలి చాటింది. స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్ కంటే కథే కింగ్ అని ప్రభాస్ సినిమా స్పష్టం చేసింది.
మూస కథలకు చెక్ సినిమా కథ, పాత్రలు ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయిన రచయితల బుర్రలో తుప్పును బాహుబలి వదిలించింది. హీరో, విలన్ మాత్రమే కాదు. సినిమాలోని ఇతర పాత్రలు కూడా కీలకంగా చూపించ వచ్చని తెలిపింది.
గాధలు పదిలం తెలుగు నేల ఎంతో చరిత్ర కలది. మన పురాణగాధలు అద్భుతం. వాటికీ బాహుబలి మరోసారి జీవం పోసింది. అవి వెండితెర మీద మరింత గొప్పగా ఉంటాయని వివరించాయి. ఉత్తరాది వారికంటే ఏ మాత్రం తెలుగు వారు తక్కువ కాదని విజయేంద్ర ప్రసాద్ కలం నిరూపించింది.
ఖాన్ లకు హెచ్చరిక బాలీవుడ్ ని గత 25 ఏళ్లుగా ఖాన్ ల కుటుంబీకులే ఏలుతూ వచ్చారు. ఇప్పుడు కూడా వారి హవానే నడుస్తోంది. దేశంలో ఏ రికార్డ్ అయినా తామే నెలకొల్పాలనే పగటి కలల్నుంచి మేల్కోవాలని బాహుబలి వారిని తట్టి లేపింది.
ప్రచారం పైసలు రాల్చవు సినిమాకి ప్రచారం కూడా అవసరమే. కానీ అందుకోసం కోట్లు కుమ్మరించనవసరం లేదని రాజమౌళి మూవీ స్పష్టం చేసింది. బాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ కి ఎక్కువ ఖర్చుపెడుతారు. టీవీల్లో ఊదరగొడుతారు. ప్రచారం చేస్తే పైసలు రాలుతాయనే భ్రమ నుంచి బాహుబలి బయటికి తీసుకొచ్చింది.
కలపై నమ్మకం మన ఆలోచనపై నమ్మకం ఉండడం సహజం. కానీ ఆ డ్రీమ్ ని చిత్ర యూనిట్ మొత్తం అంతే నమ్మడం బాహుబలి విషయంలో జరిగింది. జక్కన్న మీద నమ్మకంతో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్.. ఇలా ప్రతి ఒక్కరూ ఐదేళ్లపాటు పనిచేశారు. నిరంతరం కస్టపడి, కొత్తగా అలోచించి ఆ నమ్మకాన్ని జక్కన్న నిలబెట్టుకున్నారు. రాజమౌళి మాదిరిగా బాలీవుడ్ డైరక్టర్స్ కలక్షన్స్ కంటే ముందు నమ్మకాన్ని సంపాదించుకోవాలి.
వీఎఫ్ఎక్స్ డామినేట్ చేయకూడదు బాలీవుడ్ సినిమాల్లో వీఎఫ్ఎక్స్ , సీజీఐ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. బాహుబలిలో అంతకంటే ఎక్కువగానే ఉంది.. అయినా ఈ మూవీలో డ్రామా, ఎమోషన్స్ మిస్ కాలేదు. వీఎఫ్ఎక్స్ స్టోరీని డామినేట్ చేయలేదు. కలిసి పోయింది. అలా కలిసిపోవాలని బాలీవుడ్ టెక్నీషియన్లను వెల్లడించింది.
ఎలా ముగించాలి ?కథను గొప్పగా ప్రారంభించడమే కాదు .. ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి. బాహుబలిలో కథ ఎంత ఉత్కంఠతో మొదలవుతుందో చివరి వరకు ఆ ఉత్కంఠత ఉంటుంది. ఎక్కడా స్టోరీ డ్రాప్ కాదు. ఎక్కువగా సీక్వెల్స్ తీసి జబ్బలు చరుచుకొనే బాలీవుడ్ ప్రముఖులు కథ ప్రారంభం, ముగింపు ఎలా ఉండాలో బాహుబలి నేర్పించింది.