#90’s- A Middle Class Biopic Review in Telugu: #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • January 5, 2024 / 03:16 PM IST

Cast & Crew

  • శివాజీ (Hero)
  • వాసుకి (Heroine)
  • మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వాసంతిక, స్నేహల్ తదితరులు.. (Cast)
  • ఆదిత్య హాసన్ (Director)
  • రాజశేఖర్ మేడారం (Producer)
  • సురేష్ బొబ్బిలి (Music)
  • అజీజ్ మహమ్మద్ (Cinematography)

బిగ్ బాస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ, “అన్నీ మంచి శకునములే”తో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన వాసుకి, రిలేటబుల్ కంటెంట్ తో ఎప్పుడూ ట్రెండ్ లో ఉండే మౌళి, చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహన్ & వాసంతిక ప్రధాన పాత్రలో నవీన్ మేడారం నిర్మాణ సారధ్యంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ “#90’s”. మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్ లైన్. ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి ఆరు ఎపిసోడ్ల సిరీస్ అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

కథ: చంద్రశేఖర్ (శివాజీ) ఓ మధ్య తరగతి తండ్రి. భార్య రాణి (వాసూకి), కొడుకు రఘు తేజ (మౌళి), కూతురు దివ్య (వాసంతిక), చిన్న కొడుకు అర్జున్ (రోహన్)లతో కలిసి చాలా హుందాగా బ్రతుకే గవర్నమెంట్ స్కూల్ టీచర్. 2007 సంవత్సరంలో ఈ చిన్న కుటుంబంలో జరిగిన కొన్ని సందర్భాల సమ్మేళనమే “#90’s” వెబ్ సిరీస్.

నటీనటుల పనితీరు: శివాజీలోని నటుడ్ని మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేసిన పాత్ర చంద్రశేఖర్. మధ్యతరగతి తండ్రిగా శివాజీ ఒదిగిపోయిన తీరు అతడికి మరిన్ని పాత్రలు తెచ్చిపెడుతుంది. చాలా సన్నివేశాల్లో తన హుందాతనం & సీనియారిటీ ప్రదర్శించాడు కానీ.. టీవీలో అత్యాచారం గురించిన వార్త విని.. కూతురు కోసం ఎదురుచూస్తూ ఎవరికీ తెలియకుండా కంగారుపడే తండ్రిగా శివాజీ చాలా సెటిల్డ్ గా చేసిన నటన సిరీస్ లో ఒన్నాఫ్ ది హైలైట్. సిరీస్ లో అందరికంటే మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అతనిది కావడంతో.. చాలా వేరియషన్స్ ను అద్భుతంగా పండించాడు.

తన స్టూడెంట్ విజయాన్ని తన విజయంగా ఓన్ చేసుకొని సందర్భం, అలాగే.. కూతుర్ని ఇండిపెండెంట్ గా ఉండమని వెనకేసుకొచ్చే సందర్భంలో శివాజీ పాత్రకు నిన్నటి తరం తండ్రులే కాదు.. ప్రస్తుత తరం డాడీలు కూడా కనెక్ట్ అవుతారు.
“వినయ విధేయ రామ” ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ మరోసారి ఇరగ్గొట్టాడు. శివాజీ తర్వాత నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న నటుడు రోహన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులు, టీచర్లు తనను తెలివితక్కువాడిలా చూడడాన్ని తట్టుకోలేక తన అన్న,అక్కలతో చెప్పుకొనే ఎమోషనల్ సీన్ లో కన్నీళ్లు పెట్టించాడు.

మౌళి కామెడీ టైమింగ్ & అమాయకత్వంతో నిండిన మొహం సిరీస్ కి మంచి ఎస్సెట్ గా నిలిచింది. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం తన ప్యాషన్ ను వదులుకొంటాను అని స్నేహితుడితో చెప్పే సన్నివేశం అతడికి భవిష్యత్ లో షో రీల్ లా నిలుస్తుంది. ఇక సింగిల్ లైన్ పంచ్ లతో ఎప్పట్లానే ఇరగదీశాడు.మధ్య తరగతి ఇల్లాలిగా వాసుకి నటన, ఆమె స్క్రీన్ ప్రెజన్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఆమెను చూస్తుంటే మన ఇంట్లో అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ కూడా ఇలానే తిట్టేది, కొట్టేది, సర్ది చెప్పేది అని ఆల్మోస్ట్ అందరూ రిలేట్ అవుతారు. వాసంతిక, స్నేహల్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ సిరీస్ కు మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. రోహన్ క్యారెక్టర్ చేసే అల్లరి పనులకు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి రీల్ & రింగ్ టోన్ స్టఫ్ గా వైరల్ అవ్వడం ఖాయం. అలాగే.. ఎమోషనల్ సీన్స్ కు ఇచ్చిన బీజీయమ్ ఆడియన్స్ లో భావోద్వేగాన్ని తట్టి లేపింది. ముఖ్యంగా శివాజీ అమ్మ కథ చెబుతున్న సందర్భంలో సంగీతంతో చేసిన మ్యాజిక్ ను ఫీల్ అవ్వాల్సిందే. అజీజ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ సిరీస్ కి మరో ప్రత్యేక ఆకర్షణ. చాలా తక్కువ లొకేషన్స్ లో రిపిటీషన్ అనిపించకుండా సన్నివేశాలను తెరకెక్కించిన తీరు బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ & ఆర్ట్ వర్క్ కంటెంట్ ను బాగా ఎలివేట్ చేశాయి.

దర్శకుడు ఆదిత్య హాసన్ మన ఇంట్లోని సందర్భాలను కథనంగా రాసుకున్న విధానం భలే ముచ్చటగా ఉంది. ఉదయం అమ్మ చేసే ఉప్మా మొదలుకొని.. రాత్రి పడుకొనేప్పుడు అన్న, అక్క, తమ్ముడు చెప్పుకొనే కబుర్ల వరకూ అన్నిటినీ చాలా చక్కగా రాసుకున్న తీరు బాగుంది. అలాగే.. మొదటి ప్రేమ, మొదటిసారి తండ్రి కళ్ళల్లో చూసిన ఆనందం తాలూకు భావనలను హృద్యంగా తెరకెక్కించాడు. కథకుడిగా, దర్శకుడిగా ఫస్టు క్లాసులో పాసయ్యాడు ఆదిత్య హాసన్.

విశ్లేషణ: మీ చిన్ననాటి మధుర స్మృతులను మరోమారు తలచుకోవడం కోసం, మనసుకి హత్తుకొనే జ్ణాపకాలను నెమరువేసుకోవడం కోసం, ఆరోగ్యకరమైన హాస్యం కోసం, మనకు తెలియకుండానే మన మెదళ్ళలో కూరుకుపోయిన కూరుకుపోయిన తరగతి గది స్నేహాల కోసం కచ్చితంగా “#90’s” వెబ్ సిరీస్ ను ఈటీవీ విన్ యాప్ లో చూడాల్సిందే.


రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus