మహానటి సావిత్రి. దేవదాసు, మాయ బజార్, గుండమ్మ కథ సినిమాలు ఆమె అద్భుత నటనకు మెచ్చు తునకలు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలో నటించి నేటి తరం కథానాయికలకు మార్గ దర్శకురాలిగా నిలిచారు. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రి ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమె ఫోటోతో స్టాంపులను విడుదల చేసింది. ఇప్పటి వరకు మహానటి గురించి అనేక పుస్తకాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు ఆమె జీవితం వెండితెరపైకి రానుంది.
తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ సావిత్రి జీవితకథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎంతో మందిని కలిసి, సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నారు. ‘‘సామాన్య స్త్రీ నుంచి సూపర్ స్టార్ గా సావిత్రి ఎదిగిన తీరు నేటి తరానికి స్ఫూర్తి దాయకం. ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న అనుభవాల కలబోతే ఈ చిత్రం’’ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ.. ఆ సంగతుల జోలికి వెళ్లకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్ గా ఈ సినిమా ఉండేలా నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు.