ప్రజలకు తమ నటనతో ఆనందాన్ని ఇవ్వడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దాతృత్వంతో సాయపడానికి అంటుంటారు పెద్దలు. అందుకు తగ్గట్టుగానే మనం సినమా హీరోలు చాలామంది అవసరమైనప్పుడల్లా సాయం కోసం ముందుకొస్తారు. ప్రస్తుతం అసోంలో వరదలు పోటెత్తుతున్నాయి. వందలాది మంది ప్రజలు సొంత గ్రామాలు విడిచి సురక్షిత శిబిరాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ₹25 లక్షలు విరాళంగా ప్రకటించాడు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.
ప్రముఖ కథానాయకుడు అమీర్ ఖాన్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ₹25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయన దాతృత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని హిమంత బిస్వా శర్మ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఆమిర్ ఖాన్‌తోపాటు మరికొంతమంది సెలబ్రిటీలు అసోం సీఎంరిలీఫ్ నిధికి విరాళాలు ప్రకటించారు. అర్జున్ కపూర్, గాయకుడు సోనూ నిగమ్, నిర్మాత భూషణ్ కుమార్ విరాళాలు ఇచ్చారు. అసోం వరదల కారణంగా దాదాపు 21 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయిన విషయం తెలిసిందే.
దీంతో కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేది ఎవరు అనే అంశం మీద చర్చ మొదలైంది. దేశంలో ఎక్కడ ఏ కష్టమొచ్చినా మన హీరోలు చాలామంది సాయం ప్రకటిస్తూ ఉంటారు. తెలుగులో కూడా అలాంటి హీరోలు ఉన్నారు. అయితే తమ సినిమాలు ఆడే దగ్గరే ఇలాంటి సాయాలు చేస్తుంటారు హీరోలు అనే అపవాదు మన దగ్గర ఉంది. ఇప్పుడు అసోంలో వరదల నేపథ్యంలో అక్కడ వారికి సాయం చేయడానికి ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి.
బాలీవుడ్‌లో చాలామంది అగ్రహీరోలు ఈ సాయం వరుసలో వస్తారని ఆశిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ఇలాంటి సాయాలు చేయడం కొత్తేమీ కాదు. దేశం మొత్తం అతని సాయం గుణం గతంలోనూ చూసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అతన్ని ఎవరు అనుసరిస్తారో చూడాలి. అలాగే పాన్ ఇండియా స్టార్స్‌గా తెలుగులో ఈ మధ్య కొంతమంది స్టార్ హీరోలు వచ్చారు. వాళ్లు కూడా దేశం మొత్తం మాదే.. ఎక్కడ కష్టమొచ్చినా సాయం చేస్తాం అని మందుకొస్తారేమో చూడాలి.