బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన మానసిక ఒత్తిడిపై తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా.. తను నాలుగేళ్లకు పైగా డిప్రెషన్ కి గురైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ స్టార్ హీరో డాటర్. దీంతో ఆ డిప్రెషన్ కి గల కారణాలను వెల్లడించాలని నెటిజన్లు ఆమెని ప్రశ్నించగా.. వారి కోసం ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఐరా తన మానసిక ఒత్తిడికి గల కారణాలపై స్పందించింది.
మూడున్నరేళ్ల క్రితం ఎప్పుడైతే తన ప్రవర్తన మారడం మొదలైందో.. అప్పుడు తనను తాను జాగ్రత్తగా చూసుకోవడం మానేశానని.. ఏదో విషయంపై ఎక్కువసేపు ఆలోచించేదాన్ని అని.. ఒంటరిగా గదిలో ఉంటూ.. ఎక్కువ సమయం నిద్రపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. అలా ఎక్కువగా ఆలోచించడం వలన ఉపయోగం లేదని తరువాత తెలిసిందని చెప్పింది. ఆ తరువాత తన తల్లితండ్రుల విడాకుల గురించి మాట్లాడింది. వారు విడాకులు తీసుకున్నప్పుడు.. తనది చాలా చిన్న వయసని.. విడాకుల విషయం తనను బాధ పెట్టలేదని తెలిపింది.
తనకోసం పేరేంటో ఎప్పుడూ ఉంటారని.. ఆ విషయంలో ఒత్తిడికి గురి కాలేదని చెప్పింది. ఆరేళ్ళ వయసులో క్షయ వ్యాధి వచ్చినప్పుడు కూడా బాధ పడలేదని వెల్లడించింది. ఇక 14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నానని.. ఆ విషయం నాకు అర్ధం కావడానికి ఏడాది సమయం పట్టిందని.. వెంటనే తన తల్లితండ్రులకు ఈమెయిల్ ద్వారా విషయం చెప్పి.. దాని నుండి బయటపడినట్లు వెల్లడించింది. ఇవన్నీ దాటుకొని ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చింది.