ఆటగాళ్లు

  • August 24, 2018 / 11:00 AM IST

కెరీర్ కొత్తలో కమర్షియల్ అంశాలకు దూరంగా అర్ధవంతమైన చిత్రాలు చేసిన నారా రోహిత్ అనంతరం కమర్షియల్ హీరో మార్క్ కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఆ కోవలో వచ్చిన మరో చిత్రమే “ఆటగాళ్లు”. “ఆంధ్రుడు” ఫేమ్ పరుచూరి మురళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. ఏడాది నుంచి విడుదలవ్వడానికి నానా ఇబ్బందులుపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది. మరి ఈ ఆటగాళ్ల ఆట ప్రేక్షకుల్ని రంజింపజేసిందో లేదో చూద్దాం..!!

కథ : ప్రముఖ తెలుగు దర్శకుడు సిద్ధార్ధ్ (నారా రోహిత్) తన భార్యను హత్య చేసిన కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య తాను చేయలేదని సిద్ధార్ధ్ చెబుతున్నప్పటికీ సాక్ష్యాలన్నీ అతడికి విరుద్ధంగా ఉండడంతో అందరూ సిద్ధార్దే ఈ హత్య చేశాడని విశ్వసిస్తుంటారు. అప్పుడు ఈ కేస్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వాదించడానికి వచ్చిన ఫేమస్ క్రిమినల్ లాయర్ వీరేంద్ర (జగపతిబాబు)కు ఈ కేస్ లో సిద్ధార్డ్ తప్పులేదని తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రూవ్ చేసి సిద్ధార్ధ్ ను శిక్ష నుంచి తప్పిస్తాడు.

అయితే.. అంజలి (దర్శనీ బానిక్) హత్య కేసులో ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఏదో ఉందని గ్రహిస్తాడు వీరేంద్ర. రీ-ఇన్వెస్టిగేట్ చేయగా ఈ హత్య కేసులో చాలా మంది హస్తం ఉండడంతోపాటు.. దారుణమైన నిజాలు కూడా కప్పబడ్డాయని తెలుసుకొంటాడు వీరేంద్ర. ఏమిటా నిజాలు? ఇంతకీ అంజలిని చంపింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? అనేది “ఆటగాళ్లు” కథాంశం.

నటీనటుల పనితీరు : అది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అని ఫిక్స్ అయిపోయాడో లేక ఈ సినిమాకి అంతకంటే ఎక్కువగా కష్టపడి హావభావాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఫిక్స్ అయ్యాడో తెలియదు కానీ.. ముఖంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా కనబడనివ్వకుండా బ్లాంక్ ఫేస్ & ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఎమోషనల్ అవుతున్నాడో లేక కోప్పడుతున్నాడో అర్ధం కాక ఇబ్బందిపడుతుంటారు జనాలు.

జగపతిబాబు మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే.. ఆయన క్యారెక్టర్ కు ఉన్నంత వెయిట్ డీలింగ్ లో లేకపోవడంతో ఢీలాపడతారు ప్రేక్షకులు. బ్రహ్మానందం చేత చేయించింది కామెడీ అని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు కానీ.. ప్రేక్షకుల్ని మాత్రం నవ్వించలేకపోయాడు. అజయ్, దర్శనీ బానిక్, తులసి తదితరులు తమ తమ పాత్రలు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.

సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ దగ్గర సినిమా మరీ ఎక్కువ రోజులు ఉండిపోవడం వలన డెసిబల్స్ మరీ ఎక్కువగా ఇచ్చాడు. ఇక సినిమా మొత్తంలో ఆ “బిగ్ బాస్” షో థీమ్ మ్యూజిక్ వినబడుతున్నప్పుడు సాయికార్తీక్ ఆ షో మ్యూజిక్ కాపీ కొట్టాడా లేక ఆ షోకి కూడా సాయికార్తీక్ సంగీతం అందించాడా అనే విషయం మాత్రం అర్ధం కాదు. ఆయన ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేయడం విశేషం. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

“ఆంధ్రుడు” సినిమా చూస్తున్నంతసేపూ “అబ్బా ఏం తీశాడ్రా సినిమా” అనే భావన ప్రేక్షకులకు ప్రతి ఫ్రేమ్ లో కలుగుతుంది. అలాంటి దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో కనీస స్థాయిలో ఎమోషన్స్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేసిన ఆడియన్స్ ఆశల్ని తుంగలో తొక్కి పడేశాడు దర్శకుడు పరుచూరి మురళి. సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా లేదే. అప్పుడెప్పుడో హిందీలో అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ఓ క్రైమ్ థ్రిల్లర్ ను బేస్ చేసుకొని ఇప్పుడు “ఆటగాళ్లు” సినిమా తెరకెక్కించడం అనేది హాస్యాస్పదం. ఒక ఫిలిమ్ మేకర్ గా పరుచూరి మురళి మీద కొందరు ఫిలిమ్ లవర్స్ ఉన్న రెస్పెక్ట్ కూడా ఈ సినిమాతో పోతుంది.

విశ్లేషణ : ఈ పస లేని క్రైమ్ థ్రిల్లర్ ను చూడడం కంటే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ లు చూడడం చాలా బెటర్.

రేటింగ్ : 1/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus