ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నాలుగేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన డయాలసిస్ మీదనే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.
తన తండ్రి రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని.. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమిస్తోందని వైద్యులు చెప్పినట్లు ఫిష్ వెంకట్ (Fish Venkat) కుమార్తె స్రవంతి తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక రిస్థితి కారణంగా తండ్రికి సరైన వైద్య సేవలు అందించలేకపోతున్నామని స్రవంతి వాపోయారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు తన తండ్రిని ఆదుకోవాలని ఆమె కోరారు. చిరంజీవి గారు ముందుకు వచ్చి తన తండ్రి వెంకట్‌ను కాపాడాలని ఆమె కోరారు.
2000లో ‘సమ్మక్క సారక్క’ సినిమాతో ఫిష్ వెంకట్ సినిమా పరిశ్రమలోకి వచ్చారు. ఆ తర్వాత చిన్న పెద్ద పాత్రలు చేస్తూ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. కొన్నేళ్లు రౌడీ గ్యాంగ్‌లో ఉండే వ్యక్తిగానే కనిపించిన ఆయన.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని మంచి పాత్రలు చేశారు. ఈ క్రమంలో కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించారు. ఆఖరిగా రెండేళ్ల క్రితం ‘నరకాసుర’ అనే సినిమాలో కనిపించారు.