ఏడాదిలో ఓ హీరో నాలుగైదు సినిమాలు చేయడం పరిశ్రమకు మంచిదని పరిశ్రమ పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇది మాటకే పరిమితమవుతోందన్నది తెలిసిందే. కొంతకాలం క్రితం వరకు రవితేజ, అల్లరి నరేష్ వంటి ఈ హీరోలు ఈ లోటు తీరుస్తుండేవారు. ఇప్పుడు వారి పరిస్థితి అంతంతమాత్రంగానే మారింది. ఇటీవల విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదల చేసిన నారా రోహిత్ ఆశాకిరణంగా కనపడినా మునుపటి మూడు సినిమాలు నిరాశ పరిచాయి.
అయితే ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘జెంటిల్ మన్’ సినిమాతో ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన నాని ఈ నెల 23న విడుదల కానున్న ‘మజ్ను’ సినిమాతో మూడో సినిమాని విడుదలకు సిద్ధం చేశాడు. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటివరకు అంతా పాజిటివ్ గానే ఉంది. దీంతోపాటు ‘సినిమా చూపిస్తా మావ’ దర్శకుడు త్రినాధరావు దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తోన్న ‘నేను లోకల్’ సినిమా సైతం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయిందట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ నెలలో సినిమాని విడుదల చేయటానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.