సోనూ సూద్.. గత రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు ఓ విలన్ గానే మనకు తెలుసు. ఓ మామూలు నటుడు. తెలుగు సినిమాల్లో కరుడుగట్టిన విలన్. కానీ కరోనా విలయం.. ఈ రీల్ లైఫ్ విలన్ వెనక అసలైన రియల్ లైఫ్ హీరో ఉన్నాడని చూపించింది. కరోనా సమయంలో లక్షల మంది కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లలేక దారిలోనే కొందరు ప్రాణాలు విడుస్తుంటే.. వారికి అండగా నిలబడ్డాడు. తనకు చేతనైనంతలో వేల మందికి సాయం చేశాడు. కరోనా హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు.
కరోనా తర్వాత కూడా సోనూ తన సేవలు కొనసాగించాడు. అవసరం అని తన ఇంటి గడప తొక్కిన ప్రతివారికి తనవంతు సాయం చేశాడు. చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎంత మందికి సాయం చేశాడో లెక్కేలేదు. అందరూ సోషల్ మీడియాను ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ గా వాడుతుంటే.. సోనూ మాత్రం సాయం చేసే.. సేవలందించే ప్లాట్ ఫామ్ గా మలుచుకున్నాడు. సాయం అని సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వీలైనంత త్వరగా సాయం అందిస్తాడు.
తాజాగా సోనూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు చేశాడు. తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నాడు. ఇటుకలు తయారు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లిన సోనూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నాడు. అక్కడ పని చేసే ఓ కార్మికుడి వద్ద ఇటుకలు తయారు చేయడం నేర్చుకున్నాడు. కాసేపు సోనూయే స్వయంగా ఇటుకలు తయారు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన (Sonu Sood) సోనూ దేశంలోని కార్మికులే దేశాన్ని బలంగా తయారు చేస్తారు అని దానికి ఓ మంచి క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసి సోనూ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా సోనూ.. నువ్వు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత మంచివాడివేంటయ్యా నువ్వు అంటూ మురిసిపోతున్నారు. సెల్యూట్ సోనూ అంటూ తెగ పొగిడేస్తున్నారు.