తనపై చెయ్యి వేసిన వ్యక్తిని పోలీసులకు పట్టి ఇచ్చిన నటి!

లైంగిక వేధింపులపై నేటి తరం హీరోయిన్స్ వెంటనే స్పందిస్తున్నారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని ఊసలు లెక్కించేలా చేస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లోను యువతులకు స్ఫూర్తిగా నిలిస్తున్నారు. తాజాగా మలయాళ నటి సనూషా ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈమె బాలనటిగా సుమారు 40 చిత్రాలలో నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ మూవీ ‘బంగారం’  మీరా చోప్రాకి చెల్లెలుగా నటించింది. ఇప్పుడు హీరోయిన్ గా విజయాలు అందుకుంటోంది. సనూష బుధవారం రాత్రి రైలులో ప్రయాణం చేస్తుండగా, తమిళనాడుకు చెందిన ఆంటోబోస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంటనే అతనిని గుర్తించి పోలీసులకు అప్పగించింది. గురువారం  సనూషా మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను బుధవారం రాత్రి ట్రయిన్‌లో ప్రయాణిస్తున్నాను.

నా బెర్త్‌పై పడుకుని ఉండగా, ఒక వ్యక్తి నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం గమనించాను. వెంటనే అతని చేయి పట్టుకుని లైట్స్ ఆన్ చేశాను. అయితే నాకు అతను అసభ్యకరంగా ప్రవర్తించిన దాని కంటే కూడా పక్కన మరో ఇద్దరు రియాక్ట్ అవకపోవడం చాలా బాధించింది. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లే వరకు నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఇప్పుడు నేను చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుందని తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం పూర్తి మద్దతునిచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మహిళలు మరియు అమ్మాయిలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇటువంటి విషయాలు ఏవైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయవద్దు..’’ అని తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus