అదిరింది

తమిళ సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటించగా మూడు వారాల క్రితం విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రం “మెర్సల్”. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఏకకాలంలో విడుదలకావాల్సి ఉండగా.. సెన్సార్ ఇష్యూస్ కారణంగా కాస్త లేట్ గా నేడు (నవంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : డాక్టర్ భార్గవ్ (విజయ్) కేవలం అయిదు రూపాయలకే ఉచిత వైద్యాన్ని అందిస్తూ ప్రపంచఖ్యాతి గడిస్తాడు. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ మెజీషియన్ విజయ్ (విజయ్) తన మ్యాజిక్ పవర్స్ తో పోలీసులను బురిడీ కొట్టిస్తూ భార్గవ్ ను సన్మానించిన డాక్టర్ ను ప్లాన్ చేసి పబ్లిక్ గా చంపేస్తాడు. ఆ తర్వాత మరికొందరు డాక్టర్లను కిడ్నాప్ చేసి.. రకరకాల పరిస్థితుల్లో రకరకాల విధానాలతో వారిని దారుణంగా చంపేస్తాడు.

ఈ హత్యలు, కిడ్నాప్ లను ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ (సత్యరాజ్) ఓ పధకం ప్రకారం విజయ్ ను అరెస్ట్ చేస్తాడు. అయితే.. అప్పటికి ఇద్దరు విజయ్ లున్నారని తెలియని సత్యరాజ్ ను కన్ఫ్యూజ్ చేసి తప్పించుకొంటాడు విజయ్. ఇంతకీ విజయ్ & భార్గవ్ ల కథ ఏమిటి? విజయ్ డాక్టర్స్ ను ఎందుకు కిడ్నాప్ చేసి మరీ చంపుతాడు? విజయ్ చేసిన హత్యల నుంచి భార్గవ్ నిర్ధోషిగా ఎలా బయటపడ్డాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “అదిరింది” చిత్రం.

నటీనటుల పనితీరు : విజయ్ ఇదివరకు కూడా ద్విపాత్రాభినయం చేసినప్పటికీ.. విభిన్నమైన షేడ్స్ చూపించిన సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. విజయ్-భార్గవ్-విజయ్ భార్గవ్ అనే మూడు రోల్స్ కు వంద శాతం న్యాయం చేశాడు విజయ్. విజయ్ భార్గవ్ లుక్ లో మాస్ ఆడియన్స్ ను, విజయ్ & భార్గవ్ పాత్రల్లో యూత్ ను విశేషంగా ఆకట్టుకొన్నాడు. విజయ్ తర్వాత సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నది ఎస్.జె.సూర్య. నెగిటివ్ రోల్ లో ఎస్.జె.సూర్య ఎలాంటి ఎలివేషన్ షాట్స్ లేకుండా కేవలం హావభావాలతోనే విలనిజాన్ని పండించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా విజయ్ ఇంటికి వచ్చి అతడ్ని బెదిరించే సన్నివేశంలో సూర్య నటన అద్భుతం.

చాలాకాలం తర్వాత వడివేలు ఒక అర్ధవంతమైన పాత్రలో కనిపించారు. పెద్దగా నవ్వించకపోయినా సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఇక హీరోయిన్లుగా నటించిన కాజల్, సమంతలు ఒక పాట రెండు సన్నివేశాలకు మిగిలిపోయారు. వీళ్ళిద్దరికంటే నిత్యామీనన్ కాస్త అర్ధవంతమైన పాత్రలో నటించి మెప్పించింది.

సాంకేతికవర్గం పనితీరు : జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. స్లోమోషన్ షాట్స్ అండ్ లాంగ్ షాట్స్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరు మాస్ ఆడియన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. రెహమాన్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. తెలుగు లిరిక్స్ లో క్లారిటీ లేకపోవడంతో పాటలు చూడ్డానికి ఎంతబాగున్నా భావం అర్ధం కాక ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు.

డబ్బింగ్ విషయంలో తీసుకొన్న జాగ్రత్తల కారణంగా రెండు మూడు సన్నివేశాలు తప్పితే ఒక స్ట్రయిట్ సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకు తెలుగు నిర్మాతలు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు శరత్ మరార్ ను మెచ్చుకోవాల్సిందే.

దర్శకుడు అట్లీ రాసుకొన్న కథ చాలా పాతది, ముఖ్యంగా స్క్రీన్ ప్లే కాస్త బోరింగ్ గా రాసుకొన్నాడు. కవల విజయ్ పాత్రల క్యారెక్టర్స్ ను బాగా డీల్ చేసిన అట్లీ.. విజయ్ భార్గవ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లెంగ్త్ ను అనవసరంగా పొడిగించాడు. మొదట్నుంచి ఎమోషన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడైన అట్లీ.. ఈ చిత్రంలో హ్యూమన్ ఎమోషన్స్ ను చాలా చక్కగా తెరకెక్కించాడు. కూతురు ప్రాణం కోసం ఆరాటపడే తండ్రి పడే బాధ, భార్య ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన భర్తల ఎమోషన్స్ ను డీల్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే.. మిగతా సన్నివేశాలు చాలా రొటీన్ గా ఉంటాయి. ముఖ్యంగా పాట తర్వాత ఫైట్, ఫైట్ తర్వాత పాట అన్నట్లుగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకి ఏకైక మైనస్.

విశ్లేషణ : కొన్ని అసంబర్ధమైన సన్నివేశాలను పక్కన పెడితే.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా “అదిరింది”. ఎలాగూ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన “జి.ఎస్.టి” డైలాగ్ ను మ్యూట్ చేసేశారు కాబట్టి.. తెలుగులో ఎలాంటి గొడవలు లేకుండా “అదిరింది” చక్కగా ఆడుతుంది. సో, చాలాకాలంగా తెలుగులో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ కల “అదిరింది”తో ఫలించినట్లే.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus