అడివి శేష్ కి (Adivi Sesh) టాలీవుడ్ జేమ్స్ బాండ్ అనే పేరు ఉంది. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ‘సొంతం’ అనే సినిమాలో నటించిన ఇతను.. ఆ సినిమాతో బాగా డిజప్పాయింట్ అయినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తర్వాత ‘కర్మ’ ‘కిస్’ ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ వంటి సినిమాల్లో నటించాడు. అసలు అవి వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.
‘పంజా’ ‘బాహుబలి’ సినిమాల్లో ఇతను చేసిన నెగిటివ్ రోల్స్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘క్షణం’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘గూఢచారి’ ‘ఎవరు’ ‘మేజర్’ ‘హిట్ 2’ వంటి బ్లాక్ బస్టర్లతో ఇతను స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ‘డెకాయిట్’ ‘గూఢచారి 2’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.
మరోవైపు ఇండస్ట్రీలో కూడా తన సర్కిల్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఓ గొప్ప మాట ఉంది. ‘అపజయం అనాథ.. విజయం అందరి బంధువు’ అని..! సక్సెస్లో ఉన్నాడు కాబట్టి శేష్.. ని (Adivi Sesh) చేరదీసి వారి సంఖ్య కూడా ఎక్కువే. అక్కినేని కాంపౌండ్ నుండి సుమంత్, సుప్రియ, నాగ చైతన్య, నాగార్జున.. వీళ్లంతా అడివి శేష్ కి బెస్ట్ ఫ్రెండ్సే. మరోవైపు నాని, మహేష్ బాబు..లతో కూడా అడివి శేష్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. బాలకృష్ణతో కూడా శేష్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.
ఇప్పుడు మెగా ఫ్యామిలీపై కూడా శేష్ (Adivi Sesh) స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. నిన్న మెగా ఫ్యామిలీ కోసం ప్రసాద్ ల్యాబ్స్ లో ‘ఓజి’ స్పెషల్ షో వేశారు నిర్మాత దానయ్య. చిరు, పవన్, చరణ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అకీరా నందన్..లతో పాటు అడివి శేష్ కూడా ఈ స్పెషల్ షోకి హాజరయ్యాడు. దర్శకుడు సుజిత్ కి అడివి శేష్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే అకీరా నందన్ కి కూడా అడివి శేష్ బెస్ట్ ఫ్రెండ్. ఇలా మెగా ఫ్యామిలీకి కూడా శేష్ దగ్గరయ్యాడు అనుకోవచ్చు.