ఐరా

  • March 28, 2019 / 03:59 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం “ఐరా”. తమిళంలో తెరకెక్కిన ఈ హారర్ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో అనువదించి తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఫ్యామిలీ హారర్ ఫిలిమ్ అని పబ్లిసిటీ చేయబడుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు భయపెట్టింది? అనేది చూద్దాం..!!

కథ: యమున (నయనతార) ఒక మోడ్రన్ ఉమెన్. అమ్మానాన్నల మీద గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ.. వాళ్ళు చెప్పినట్లు కాకుండా తనకు నచ్చినట్లుగా బ్రతకాలి అనుకుంటుంది. తనకు ఇష్టం లేకుండా కుదిర్చిన పెళ్లిని తప్పించుకోవడం కోసం వైజాగ్ లోని తన అమ్మమ్మ ఇంటికి పారిపోతుంది. అక్కడ ఉంటూనే.. “లైవ్ ఘోస్ట్ ఎక్స్ పీరియన్స్” అనే ప్రోగ్రామ్ ద్వారా దెయ్యాలు ఉన్నట్లు కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటుంది.

అయితే.. ఒకానొక సందర్భంలో భవానీ అనే దెయ్యం కారణంగా నిజమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు భవానీ ఎవరు? యమునను ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఆమె కథ ఏమిటి అనేది “ఐరా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు: నయనతార ద్విపాత్రాభినయం “ఐరా” చిత్రానికి మెయిన్ సెల్లింగ్ పాయింట్ మాత్రమే కాదు.. సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ కూడా. యమున అనే మోడ్రన్ ఉమెన్ పాత్రలో ఎంత స్టైలిష్ గా కనిపించిందో.. భవానీ అనే దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా అంతే అద్భుతంగా నటించింది. రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించిన విధానం కూడా బాగుంది. ఆమె పాత్ర ద్వారా కొందరు మహిళలు సమాజంలో తమ రూపురేఖలు, రంగు కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దర్శకుడు చూపించాలనుకోవడం అభినందనీయమైన విషయమే.

యోగిబాబు కాస్త గట్టిగానే ప్రయత్నించాడు కానీ ఈసారి పెద్దగా నవ్వించలేకపోయాడు. జయప్రకాష్, మీరా కృష్ణన్, లీలాలు తమ పాత్రలకు న్యాయం చేశారు.నయనతార తర్వాత సినిమాలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి కలైయారసన్. అభినవ్ పాత్రలో అభ్యుదయ భావాలు కలిగిన మంచి కుర్రాడిగా చక్కగా ఒదిగిపోయాడు.

సాంకేతికవర్గం పనితీరు:సుందరమూర్తి సంగీతం సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. రెగ్యులర్ హారర్ సినిమాల్లా జస్ట్ జంప్ స్కేర్ షాట్స్ కి బీజీయమ్ అందించినట్లుగా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించాడు. సన్నివేశాల కంపోజింగ్ బాగుండి ఉంటే.. సుందరమూర్తి సంగీతానికి ఇంకాస్త ఎలివేషన్ వచ్చి ఉండేది.సుదర్శన్ సినిమాటోగ్రఫీ కొత్తగా లేకపోయినా.. రిచ్ గా ఉంది. నయనతారను నల్లగా చూపించడం కోసం ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని బ్లాక్ & వైట్ లో ఎందుకు షూట్ చేశారు అనేది అర్ధం కానీ ప్రశ్న.

దర్శకుడు సర్జున్ రాసుకున్నది చాలా చిన్న పాయింట్. ఈ సినిమా మూల కథ మనకి పూరీ జగన్నాధ్ తీసిన “దేవుడు చేసిన మనుషులు” చిత్రాన్ని జ్ణప్తికి తెస్తుంది. ఆ సినిమాలో లాగే “ఐరా”లోనూ స్ట్రాంగ్ ఎమోషన్ అనేది లోపించింది. ముఖ్యంగా.. యమునపై భవానీ పగబట్టడానికి కానీ.. తీర్చుకోవాలనుకోవడానికి కానీ లాజిక్ ఉండదు. లాజిక్ పక్కన పెడితే.. ఆ రీజనింగ్స్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి. దర్శకుడు నయనతారను దృష్టిలో పెట్టుకొని కథను బాగానే రాసుకున్నా.. కథనం, సన్నివేశాల కంపోజింగ్ ను మాత్రం గాలికొదిలేశాడు. సినిమాకి చాలా కీలకమైన ట్విస్టులను దర్శకుడు రివీల్ చేసేలోపే ఆడియన్స్ క్యాచ్ చేసి “ఇది ట్విస్టా?” అని అరుస్తున్నారంటేనే స్క్రీన్ ప్లే అనేది ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

విశ్లేషణ: హారర్ సినిమాకి కావాల్సింది స్ట్రాంగ్ ఎమోషన్ & లాజిక్. ఈ రెండూ లోపించిన “ఐరా” ప్రేక్షకుల్ని భయపెట్టడం, సినిమాలో ఎంగేజ్ చేయడం అటుంచి.. బోర్ కొట్టిస్తుంది. అందులోనూ రెండున్నర గంటల సినిమా కావడంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. నయనతార ఉంటే సరిపోదు.. ఆమెతోపాటు మంచి కథ, కథనం కూడా ఉండాలని మరోసారి గుర్తుచేసిన చిత్రం “ఐరా”.

రేటింగ్: 1.5/5

CLICK HERE TO READ IN ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus