నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ స్టామినా గురించి మనకు తెలిసిందే. లోకల్ గా ఆయన రికార్డులు కొట్టడం మామూలే, కానీ ఈసారి అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఆయనకు ఒక పెద్ద టార్గెట్ సెట్ అయ్యింది. ‘అఖండ 2’ సినిమాకు అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.5 మిలియన్ డాలర్లు రాబట్టాలట. ఇది బాలయ్య కెరీర్ లోనే అత్యంత క్లిష్టమైన సవాల్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఎందుకంటే గత రికార్డులు చూస్తే విషయం అర్థమవుతుంది. బాలయ్యకు అక్కడ సూపర్ హిట్స్ గా నిలిచిన ‘భగవంత్ కేసరి’, ‘వీరసింహారెడ్డి’ కూడా 1.26 మిలియన్ డాలర్ల మార్క్ దగ్గరే ఆగిపోయాయి. అంటే ఇప్పుడు బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే, బాలయ్య తన కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ను క్రాస్ చేయడమే కాకుండా, కొత్త చరిత్ర సృష్టించాల్సి ఉంటుంది. పాత రికార్డులకు, ఇప్పుడున్న టార్గెట్ కు మధ్య గ్యాప్ చాలానే ఉంది.
అసలు ఈ టార్గెట్ ఇంతలా పెరగడానికి బలమైన కారణాలే ఉన్నాయి. సినిమా రిలీజ్ తేదీలు మారడం, ఫైనాన్షియల్ గా లావాదేవీల లెక్కలు మారడంతో ఓవర్సీస్ డీల్ రివైజ్ అయ్యిందట. వడ్డీలు, ఆలస్యం అన్నీ కలిపి బ్రేక్ ఈవెన్ మార్క్ ను 1.5 మిలియన్లకు చేర్చాయి. దీంతో సినిమాకు ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా అక్కడ గట్టెక్కడం కష్టమవుతుంది.
సాధారణంగా ఈ నెంబర్ మిగతా స్టార్ హీరోలకు ఈజీనేమో కానీ, బాలయ్య మార్కెట్ కు ఇది పెద్ద పరీక్షే. అయితే ఇక్కడ ఉన్న ఏకైక పాజిటివ్ పాయింట్ ‘అఖండ’ బ్రాండ్. ఆ డివోషనల్ టచ్, బోయపాటి మాస్ ఎలివేషన్స్ కరెక్ట్ గా పడితే.. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడతారు. కంటెంట్ లో దమ్ముంటే ఈ టార్గెట్ ను బాలయ్య ఈజీగా కొట్టి పారేస్తారు. ఏదేమైనా ఈసారి బాలయ్య యుద్ధం మామూలుగా ఉండదు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఈ 1.5 మిలియన్ల మార్క్ ను అందుకోలేరు. మరి ఆ ‘శివ తత్వం’ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, బాలయ్య అమెరికాలో కూడా జెండా పాతేస్తారో లేదో చూడాలి.