AKHANDA 2: ‘అఖండ 2’ టికెట్ల మోత.. నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఇదే!

బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. ‘అఖండ 2: తాండవం’ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఫ్యాన్స్‌లో హీట్ పెరుగుతోంది. అయితే ఈ మధ్య పెద్ద సినిమాలంటే చాలు, టికెట్ రేట్లు చూసి సామాన్యుడు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. జేబులకు చిల్లులు పడటం ఖాయం అని ఫిక్స్ అయిన ఆడియన్స్‌కు, ఈ సినిమా నిర్మాతలు రామ్, గోపి ఆచంటలు ఒక ఊరటనిచ్చే వార్త చెప్పారు. రేట్ల పెంపు విషయంలో వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

AKHANDA 2

సినిమా కోసం భారీగా ఖర్చు చేశాం కాబట్టి, టికెట్ రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందని నిర్మాతలు క్లియర్‌గా చెప్పేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. పెంపు ఉంటుంది కానీ, అది ఆడియన్స్‌ను భయపెట్టేలా ఉండదని మాటిచ్చారు. ఇటీవల కొన్ని పాన్ ఇండియా సినిమాలకు పెంచిన రేట్లు చూసి జనం థియేటర్లకు రావడమే మానేశారు. ఆ తప్పు తాము చేయకూడదని, ప్రేక్షకుడికి భారమనిపించని రీతిలోనే ధరలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇక ప్రీమియర్ షోల విషయంలోనూ మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. కేవలం అభిమానుల కోలాహలం మీదే ఆధారపడకుండా, సామాన్య ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్‌కే ఎక్కువ విలువిస్తున్నారు. ఫ్యాన్స్ ఎలాగూ ఎగబడి చూస్తారు, కానీ సినిమా లాంగ్ రన్ నిలబడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ థియేటర్‌కు రావాల్సిందే. అందుకే ప్రీమియర్స్ ద్వారా వచ్చే టాక్ పాజిటివ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టికెట్ రేటు ఎంత ఉండాలనేది తాము ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయించమని, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి తెలిసిన డిస్ట్రిబ్యూటర్లతో చర్చించాకే ఫైనల్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ‘అఖండ 2’ టీమ్ స్ట్రాటజీ చాలా క్లియర్‌గా ఉంది. ఓపెనింగ్స్ పేరిట బాదుడు లేకుండా, రీజనబుల్ రేట్లతో జనాలను థియేటర్లకు రప్పించాలనే వారి ఆలోచన మంచిదే. కంటెంట్ బాగుండి, టికెట్ రేటు అందుబాటులో ఉంటే బాలయ్య రికార్డుల మోత ఆపడం ఎవరి వల్లా కాదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus