కరోనా సోకినందు వల్ల మనిషి ఆరోగ్యం పాడవుతుంది… అయితే ఆందోళన అంతకుమించి హాని చేస్తుంది అంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. కారణం… మనకు ఏమైపోతుంది అనే ఆలోచనే ఆరోగ్యాన్ని దహించేస్తుంది. దీంతో చాలామంది ఆరోగ్య సూత్రాలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే ప్రయత్నం చేశారు. కరోనాను ఎదుర్కోవానికి ఉపయోగపడే ఐదు సూత్రాలను చెప్పుకొచ్చాడు.
ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న కరోనా అవగాహన కార్యక్రమంలో ఇటీవల అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఐదు ఆరోగ్య సూత్రాలతో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయన చెప్పిన విషయాలు కొత్తవి కాకపోయినా ఆరోగ్యాన్ని కాపాడేవి, కరోనాను ఎదుర్కోవడానికి ఉపయోగపడేవి. కాబట్టి ఒకసారి మీరూ చదివేయండి. అవసరమైనవాళ్లకు వాటిని అర్థమయ్యేలా వివరించండి.
ఆయన చెప్పిన ఆరోగ్య సూత్రాలు మీ కోసం…
1. కరోనా బారిన పడ్డ వ్యక్తి.. ఇంట్లో వాళ్లతో కలవకుండా ఓ గదిలో కొన్నిరోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి.
2. మొబైల్ ద్వారా వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలి.
3. సబ్బు/శానిటైజర్‌తో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
4. అన్నివేళలా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
5. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి, ఆస్పత్రికి వెళ్లాలి