నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో ‘ఆదిత్య 369’ (Aditya 369) ఒక చిరస్థాయి చిత్రం. 1991లో సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) దర్శకత్వంలో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆనాటి ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ని (Aditya 999) తీసుకురావాలని బాలయ్య ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. అయితే, రాజకీయ, నటనా బాధ్యతల మధ్య ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా డైరెక్ట్ చేయడం సాధ్యం కాకపోవడంతో, దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి (Krish Jagarlamudi) ఈ బాధ్యతను అప్పగించినట్లు సమాచారం.
ఆర్కా మీడియా సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ‘ఆదిత్య 999’ స్క్రిప్ట్ బాలయ్య వద్ద ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో తన కుమారుడు మోక్షజ్ఞను (Nandamuri Mokshagnya Teja) హీరోగా పరిచయం చేయాలని బాలయ్య గతంలో ప్రకటించాడు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రశాంత్ వర్మతో (Prasanth Varma) ఓ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ, అది మధ్యలోనే ఆగిపోయింది.
ఇప్పుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘ఆదిత్య 999’తో మోక్షజ్ఞ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. క్రిష్ జాగర్లమూడి, బాలయ్యతో గతంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni) , ‘ఎన్టీఆర్ బయోపిక్’ (NTR: Kathanayakudu)సినిమాలు తీసి ఒక టెక్నీషియన్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన క్రిష్, అనుష్కతో (Anushka Shetty) ‘ఘాటీ’ (Ghaati) సినిమాను ఇప్పటికే పట్టాలెక్కించాడు.
ఈ సినిమా రిలీజ్ దశలో ఉండగా, బాలయ్యతో ‘ఆదిత్య 999’ ప్రాజెక్ట్‌ను కూడా క్రిష్ స్వీకరించినట్లు తెలుస్తోంది. క్రిష్ వేగంగా పనిచేసే తత్వం, బాలయ్య మైండ్‌సెట్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం ఈ సినిమా కోసం అతన్ని సరైన ఎంపికగా మార్చాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘ఆదిత్య 999’ సైన్స్-ఫిక్షన్ జోనర్‌లో రానుందని, ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో కొత్త కథను అందించనుందని అంటున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కానుందని, షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.