బ్రహ్మానందం… మన జీవితంలో రోజూ భాగమైపోయిన పేరు. ఆయన లేకుండా ఒక్కోసారి మనం ఏ పనీ చేయలేం అనిపిస్తుంది. ఆ పేరు ఎత్తకుండా, ఆయన సినిమా ప్రస్తావన రాకుండా మనం ఒక్కోసారి ఏం చేయలేం అని కూడా అనిపిస్తుంది. బయట సమాజంలో కాస్త కొత్తగా, వింతగా కనిపిస్తే.. ‘ఫలానా సినిమాలో బ్రహ్మానందంలా ఉన్నాడు కదా’ అని అనుకోకుండానే అనేస్తాం. ఇక ఆయన మీమ్స్, వీడియోలు, కామెడీ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇదంతా ఆయన నటుడు అయ్యాకనే.
అయితే, అంతకుముందు ఆయనేంటి? ఈ ప్రశ్నకు ఏముంది ఆయన అంతకుముందు లెక్చరర్ అని చెప్పేస్తారు. అది మాత్రమే కాదు. ఆయన జీవితంలో మనకు చెప్పని, చూపించని, వినిపించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, మంచి మనిషిగా ఎదిగేలా చేస్తాయి. ఇలాంటి చాలా విషయాలను ఆయన త్వరలో మనతో పంచుకోబోతున్నారు. అయితే అది ఏ షోగానో, ఏ సినిమాగానో కాదు. తన జీవితాన్ని పుస్తకంగా తీసుకొస్తున్నారాయన. ఆ ప్రయత్నం చివరి దశకు వచ్చింది కూడా అని టాక్.
వరుసగా వందల సినిమాలు చేసుకుంటూ వచ్చిన బ్రహ్మానందం… ఇప్పుడు అంతగా సినిమాలు చేయడం లేదు. చాలా సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాయి. ఈ గ్యాప్లో ఆయన తన ఆత్మకథ రాసుకున్నారట. దాని పేరే ‘నేను.. మీ బ్రహ్మానందం’. పైన చెప్పుకున్నట్లే బ్రహ్మానందం మంచి నటుడు మాత్రమే కాదు, ఓ ఫిలాసఫర్ కూడా. చిత్రకారుడు కూడానూ. ఇలా ఆయనలో చాలా కోణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వస్తాయి అంటున్నారు.
దాంతోపాటు టాలీవుడ్‌లో (Brahmanandam) బ్రహ్మానందంతో చాలామంది హీరోలకు, దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ మంచి అనుబంధం ఉంది. అది కూడా ఈ పుస్తకంలో కనిపిస్తుంది అని చెబుతున్నారు. అలాగే తన జీవితంలో ఆటుపోట్లను ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈ పుస్తకాన్ని డిసెంబరులో విడుదల చేస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘జులాయి’ సినిమాలో సరదాగా ఆత్మకథ రాసుకుంటా అని చెప్పిన బ్రహ్మీ… ఇప్పుడు ఇలా రాశారన్నమాట.