తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సమస్యలు ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందుగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఆ జీవోలేవో ఇష్యూ చేయండి’ అని కోరారు. ఎందుకంటే ‘పరిస్థితి ఏమీ బాగోలేదు’ అని పవన్ కల్యాణ్ గళమెత్తారు. ఆ తర్వాత ‘అంతా బాగానే ఉంది’ అని నిర్మాతల మండలి చెప్పింది. అంటే మొత్తంగా నిర్మాతలు చెప్పినట్లే. అయితే ఇప్పుడు సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మరోలా మాట్లాడారు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వేదికగా అల్లు అరవింద్ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడారు. ‘‘చలనచిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా? దయచేసి మీరు తలుచుకుని, పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపగలరని కోరుతున్నా. మీరు చిత్ర పరిశ్రమను ఎంత ప్రోత్సహిస్తే.. అంతగా సినిమాలు విడుదలవుతాయి. నేను చేసే విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకోండి’’ అని అల్లు అరవింద్ కోరారు. పరిశ్రమ సమస్యలపై పవన్ స్పందించినప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన హీరోల నుండి పెద్దగా స్పందన రాలేదు.
దీంతో హీరోల మధ్య ఐక్యత లేదు అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు నిర్మాతల మధ్య కూడా ఐక్యత లేదా అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ‘అంతా బాగుంది’ అని నిర్మాతల మండలి అంటుంటే… ‘మీరు ప్రోత్సహిస్తే మరిన్ని సినిమాలొస్తాయి’ అని అల్లు అరవింద్ అంటున్నారు. ఈ విషయంలో లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక.