కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కాంతారా’ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు అల్లు అరవింద్. ఇప్పుడు మరో సినిమాను కూడా టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. ఈ నెల 24న బాలీవుడ్ లో విడుదల కాబోతున్న ‘బేడియా’ సినిమాను తెలుగులోకి ‘తోడేలు’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించారు.
హారర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. తెలుగులో కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావించిన అల్లు అరవింద్ దీని డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారట. అయితే ఆయన అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గీతాఆర్ట్స్ లో విడుదలయ్యే సినిమాలకు థియేటర్లు బాగానే దొరుకుతాయి. డబ్బింగ్ సినిమాలైనా.. అల్లు అరవింద్ తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేసి బజ్ వచ్చేలా చేస్తుంటారు.
ఆ విధంగా మంచి హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఇలా ఇతర భాషల సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయడం వలన తెలుగు సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని కొందరు డిస్ట్రిబ్యూటర్ల వాదన. ఈ డబ్బింగ్ సినిమాలకు హిట్ టాక్ రావడంతో.. తెలుగులో చిన్న సినిమాల మార్కెట్ ఫెయిల్ అవుతుందని ఆరోపిస్తున్నారు. ‘కాంతారా’ సినిమా విడుదలైన సమయంలోనే తెలుగులో ‘ఓరి దేవుడా’, ‘ప్రిన్స్’, ‘సర్ధార్’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ‘కాంతారా’ ముందు ఏదీ నిలబడలేకపోయింది.
డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి వరుసగా తీసుకొస్తే.. మన సొంత సినిమాల మార్కెట్ దెబ్బతింటుందని అంటున్నారు. అలా చూసుకుంటే.. మన తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అవి అక్కడ భారీ విజయాలు అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీస్ అంటూ మనం కూడా మార్కెట్ పరిధిని పెంచుకోవాలని చూస్తున్నాం. అలాంటప్పుడు ఇతర భాషల వారు కూడా అలా ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఆ సినిమాలను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనేది ఇండస్ట్రీ సభ్యుల వాదన.